
సాక్షి, న్యూఢిల్లీ : అపార్ట్‌మెంట్‌లో తప్పతాగి న్యూసెన్స్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలనుకున్న ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన గురుగ్రామ్ జిల్లాలోని మానేసర్ ఇండస్ట్రియల్ ఏరియాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. ఓ మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో పనిచేసే విశాల (పేరుమార్చాం) ఉద్యోగం పూర్తయ్యాక ఇంటికి బయలు దేరారు. రాత్రి 10 గంటల సమయంలో తను నివాసముండే అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు మెట్ల గుండా వెళ్లే క్రమంలో.. అదే ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో కొందరు యువకులు మద్యం సేవించి, న్యూసెన్స్ చేస్తుండడం గమనించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు వివరాలు కనుగొనే యత్నం చేశారు. అయితే, విశాల చేతిలోనున్న లంచ్‌బాక్స్ కిందపడింది. శబ్దం కావడంతో మద్యం సేవించిన వారిలో నుంచి ఓ వ్యక్తి బయటికొచ్చి ఆమెపై దాడి చేశాడు. బలవంతంగా ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడని అదనపు ఎస్పీ షంషేర్ సింగ్ తెలిపారు.
తీవ్ర పెనుగులాట అనంతరం మృగాళ్ల బారినుంచి బయటపడిన విశాల తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. వారు ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. అయితే, ఫిర్యాదు అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారనీ, మిగతా వారిని విడిచిపెట్టేందుకు యత్నించారని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపించారు. ఏఎస్పీకి సమాచారం అందించిన తర్వాతనే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా, యువతిపై అత్యాచార యత్నం చేసిన వారిలో అయిదుగురిని అరెస్టు చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉండగా.. ఈ ఘటనకు ముందే.. న్యూసెన్స్ చేస్తున్నారని ప్రశ్నించిన పక్కింటివారిపై నిందితులు దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment