
పురుగుమందు తాగిన తల్లి ప్రమీలను ఆస్పత్రికి తీసుకువెళుతున్న దృశ్యం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాలురు
వీఆర్ పురం (రంపచోడవరం): కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ముగ్గురు బిడ్డలతో విషాహారం తినిపించి, ఆపై తాను పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని వడ్డిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన బాగుల అంజనరావు డిష్ టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ భార్య ప్రమీలతో జీవిస్తున్నాడు. వారికి ఎనిమిదేళ్ల సాయిచరణ్, ఏడేళ్ల అజయ్‌కుమార్, ఐదేళ్ల పార్ధూ అనే కుమారులు ఉన్నారు. ఒక విషయమై ఆ దంపతుల మధ్య రెండు రోజులుగా వాగ్వాదం చోటు చేసుకొన్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో అంజనరావు తన విధుల కోసం బుధవారం ఉదయం వేరే గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఇంటివద్ద ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను తల్లి ప్రమీల పిలిచి పురుగు మందు కలిపిన సున్నుండలను తినిపించింది. అటుపై ఆమె పురుగు మందు తాగేసింది. దీనిని గమనించిన ఇరుగు పొరుగు వారు ప్రజలు ఆమెను, పిల్లలను కూనవరం సీహెచ్‌సీ తరలించారు.అక్కడ డాక్టర్ కిరణ్ ఆ నలుగురి కడుపులోని మందును కక్కించే ప్రయత్నం చేశారు.పిల్లలకు ప్రమాదం లేదని తేలింది. తల్లి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పడంతో కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం ఆమెను అంబులెన్స్‌లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.