
ఆత్మహత్యకు పాల్పడిన జ్యోతి, గల్లంతైన చిన్నారులు నిసర్గ, పవన్(ఫైల్)
కర్ణాటక,మండ్య : చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు, భర్త బాధ్యతారాహిత్యంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలసి చెరువులోకి దూకింది. ఘటనలో తల్లి మృతి చెందగా చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఉదంతం శుక్రవారం మండ్య తాలూకా తిబ్బనహళ్లిలో చోటు చేసుకుంది. తాలూకాలోని హుళ్లేనహళ్లి గ్రామానికి చెందిన నంజప్పకు అదే ప్రాంతానికి చెందిన జ్యోతి (33)తో చాలా కాలం క్రితం వివాహమైంది. కొద్ది కాలంగా నంజప్ప అనారోగ్యంతో బాధ పడుతుండడంతో కుటుంబ పోషణభారం జ్యోతి పై పడింది.
ఈ పరిస్థితుల్లో నంజప్ప ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో అప్పు చేసి ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో కొత్త బైకు కొనాల్సిన అవసరం ఏంటంటూ జ్యోతి తన భర్తను ప్రశ్నించింది. ఇదే విషయమై కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా శుక్రవారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన జ్యోతి ఇద్దరు పిల్లలు నిసర్గ (7), పవన్(4)లతో కలసి తిబ్బనహళ్లి గ్రామ సమీపంలోని కాలువలో దూకింది. గమనించిన స్థానికులు కాలువలోకి దూకి రక్షించడానికి ప్రయత్నించారు.అప్పటికే జ్యోతి మృతి చెందగా ఇద్దరు పిల్లల కొట్టుకుపోయారు. ఈ ఘటనతో జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవు తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment