ప్రతీకాత్మక చిత్రం
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాత్రంతా సినిమాలు చూస్తుందనే కారణంగా ఓ వ్యక్తి తన భార్య(22)ను హతమార్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాలు... చేతన్ చౌగేలే(32) భార్యతో కలిసి అంధేరిలో నివసిస్తున్నాడు. వీరికి రెండేళ్ల బిడ్డ ఉంది. అయితే గత కొంత కాలంగా భార్య యూట్యూబ్‌కు బానిసగా మారడంతో చేతన్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.
ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది. సౌండ్ ఎక్కువగా వస్తున్న కారణంగా తనకు, బిడ్డకు నిద్ర పట్టడం లేదని చేతన్ భార్యకు చెప్పినప్పటికీ ఆమె అతడి మాటలు పట్టించుకోలేదు. తెల్లవారి నాలుగు గంటల వరకు సినిమాలు చూస్తూనే ఉండటంతో కోపోద్రిక్తుడైన చేతన్ నైలాన్ తాడుతో ఉరి బిగించి, ఆమె గొంతు నులిమాడు. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలనుకోగా అప్పటికే ఆమె మృతి చెందింది. కాగా భార్య ప్రవర్తనతో విసిగిపోయి... క్షణికావేశంలోఆమెను హత్య చేశానని చేతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment