
తీవ్రంగా గాయపడ్డ యాకయ్య, (యాదమ్మ)
సాక్షి, జనగాం : మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం.. శుభముహుర్తం కావడంతో ఆదివారం అతడి కుటుంబ సభ్యులు గృహ ప్రవేశం కూడా చేశారు. నుదుట బొట్టు, పట్టు వస్త్రాలు ధరించి పెళ్లి పీటలెక్కాల్సిన అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కలల స్వగృహంలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకున్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. కాబోయే భార్యతో అర్ధరాత్రి బయట ఫోన్‌లో మాట్లాడుతున్న అతడిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దాదాపు 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అనుమానాలు రేకిత్తిస్తున్న ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగింది.
గ్రామానికి చెందిన గొంగళ్ల సామ్యేల్ ఏకైక కుమారుడు యాకయ్య (24)కు మాదారం గ్రామానికి చెందిన ఓ యువతితో 20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 21న పెళ్లి ముహుర్తంగా నిర్ణయించారు. శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకూ పంచారు. పెళ్లిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి వరుడి కుటుంబం ఆదివారం గృహ ప్రవేశం కూడా చేసింది. గృహ ప్రవేశానికి వధువు తరఫు బంధువులు హాజరయ్యారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత అలసట చెందిన వారంతా నిద్రిస్తున్నారు.
ఈ క్రమంలోనే వధువు నుంచి యాకయ్యకు ఫోన్ రావడంతో ఆమెతో మాట్లాడుతుండగా తనకు సరిగ్గా వినిపించడం లేదని, బయటికి వచ్చి మాట్లాడాలని ఆమె కోరింది. దీంతో యాకయ్య బయటికి వచ్చి ఫోన్‌లో మాట్లాడుతుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న నలుగురు యువకులు మాస్కులు ధరించి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు భరించలేక యాకయ్య కేకలు వేయడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తల్లి యాదమ్మ అతడిని పట్టుకోవడంతో ఆమె చాతి, చేతులకు గాయాలయ్యాయి. యాకయ్య భూమిపైనే బొర్లుతూ మంటలను చల్లార్చుకోగలిగాడు. అప్పటికే చాతి, వీపు 50 శాతం కాలడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై అనుమానాలు..
వరుడిపై జరిగిన హత్యాయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. పెట్రోల్ పోసి అంటించింది ఎవరు..? ఎవరి ప్రోద్బలమైన ఉందా.. ? ఎందుకు హత్యాయత్నం చేశారు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫోన్ మాట్లాడుతుండగా సిగ్నల్ రావడం లేదని బయటకు రావాలని పదేపదే వధువు తనకు చెప్పిందని, అందుకే ఇంటి ముందుకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నానని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాకయ్య పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.
వారం రోజుల క్రితం యాకయ్య తండ్రి సామ్యేల్ గేదెలకు మేత వేసేందుకు ఇంటి బయటటికి రాగా వరుడిగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. అయితే దొంగలుగా భావించిన కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ఉండడంతో ఈ ఘటనను పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ తిరుపతి, ఎస్సై రంజిత్‌రావు కంచనపల్లిలో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వధువు గ్రామంలో కూడా విచారణ చేపట్టారు. కాగా తమ కుమారుడిపై దాడికి వధువే కారణమని సామ్యేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment