
హత్యకు గురైన అనిశెట్టి మురళి (ఫైల్)
వరంగల్ క్రైం : హన్మకొండ కుమార్‌పల్లిలో దారుణ హత్యకు గురైన 44వ డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసు ముందుకు సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ను హత్య చేసి సంవత్సరం గడిచినా పోలీసులు చార్జీషీట్ దాఖాలు చేయకపోవడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తీవ్ర అవేదనకు గురవుతున్నారు. 2017 జూలై 13న హన్మకొండ కుమార్‌పల్లిలో అనిశెట్టి మురళిని దారుణంగా హత్య చేశారు.
హత్యచేసిన నిందితులు బొమ్మతి విక్రంకుమార్, రేకుల చిరంజీవి, మార్త వరుణకుమార్‌లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ మరుసటి రోజు రాత్రి ఎనిమి ది గంటలకు ముగ్గురు నిందితులను జిల్లా జడ్జీ సెదుట హాజరుపరిచి జైలుకు పంపించారు. హత్యకేసులో ప్రధాన నిందితుడు బొమ్మతి విక్రమ్ తన తండ్రి బొమ్మతి జనార్ధన్‌ను హత్య చేసినందుకే చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.
కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసు వెనక కాంగ్రెస్ నేతల హస్తం ఉందనే విషయం పోలీ సుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డిని ఎ–4గా, పోతుల శ్రీమన్‌ను ఎ–5గా, మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్‌ను ఎ–6గా నమోదు చేశారు.
దీంతో మురళి హత్య రాష్త్రవ్యాప్తంగా సంచలనమైంది. నిందితులకు కత్తులను అందజేసింది పోతుల శ్రీమాన్, హత్యకు సహకారం అందిస్తానని చెప్పింది నాయిని రాజేందర్‌రెడ్డి, వారితో మాట్లాడింది కానుగంటి శేఖర్ అని ఆరోపణలు వెలువడ్డాయి.
ఆ తరువాత పోలీసులు చేపట్టిన విచారణలో మరో ఇద్దరు నిందితులు కురిమిళ్ల రాజ్‌కుమార్, గజ్జీ సాగర్‌కు కూడా హత్యతో సంబంధాలున్నట్లు తేలిసింది. దీంతో హన్మకొండ పోలీసులు ఈ ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపించారు. కాగా, హత్యతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పోతుల శ్రీమాన్, కానుగంటి శేఖర్ కోర్టును అశ్రయించి రాజకీయంగా దెబ్బతీయటానికి అధికార పార్టీ నేతలు హత్య కేసులో ఇరికించారని ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
ఆరుగిరిపై రౌడీషీట్..
అనిశెట్టి మురళి హత్య కేసులో నింధితులుగా ఉన్న బొమ్మతి విక్రం, రేకుల చిరంజీవి, మార్త వరుణ్‌కుమార్, కురిమిళ్ల రాజ్‌కుమార్, గజ్జీ సాగర్‌లపై హన్మకొండ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. హత్యకు ముందే పోతుల శ్రీమాన్‌పై రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య నిందితులు జైలు నుంచి విడుదలైన తరువాత మూడు నెలల పాటు షరతులపై హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసి వెళ్లారు.
పోలీసుల విచారణకు రాజకీయ నేతల ఒత్తిళ్లు..
అనిశెట్టి మురళి హత్య వెనక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు హత్య సమయంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయకపోవడంపై పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
దీంతో పాటు హత్య కేసులో ప్రధాన నిందితుడు బొమ్మతి విక్రం సైతం హత్య కేసులో సంబంధమున్న కొంతమంది మురళి కుటుంబసభ్యులతో రాజీకుదుర్చుకున్నారని ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిశెట్టి మురళి కుటుంబసభ్యులు, బంధువులు మాత్రం మురళి హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యగానే చెబుతున్నారు.