వర్షశ్రీ (ఫైల్), మృతి చెందిన మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడో యువకుడు.. ఏం జరిగిందో ఏమో యువతితో పాటు ఆ యువకుడూ వేర్వేరుగా ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయారు. అనుమానాస్పద స్థితిలో యువతీయువకులు మరణించిన ఈ ఘటన శుక్రవారం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. వీరిద్దరూ స్నేహితులని, ఇద్దరి మధ్యా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే యువకుడిది హత్యేనని అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, యువతి కొన ఊపిరితో ఉన్నట్టు ఘటనాస్థలికి వచ్చిన ‘108’ సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరికి తనువు చాలించింది.
కుటుంబీకులు శుభకార్యానికి వెళ్లడంతో..
ఖైరతాబాద్ న్యూ సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన ఆకుల శ్రీనివాస్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. తెల్లవారుజామున న్యూస్ పేపర్ హాకర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈయన భార్య అనిత గృహిణి. వీరికి వెంకట సుమన్, వర్షశ్రీ(22) సంతానం. గురువారం నల్లకుంటలోని సమీప బంధువు ఇంట్లో పెళ్లి ఉండటంతో అంతా వెళ్లారు. శ్రీనివాస్ తల్లి శంకరమ్మ(80) ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వర్షశ్రీ, శ్రీనివాస్ ఇంటికి వచ్చేశారు. ఉదయం 10:30కి శ్రీనివాస్ విధులకు వెళ్లగా.. వర్షశ్రీ, శంకరమ్మ ఇంట్లో ఉన్నారు. వర్షశ్రీకి పరిచయ స్తుడైన బడంగ్‌పేటకు చెందిన మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2:15కి ఆమె ఇంటికి వచ్చాడు.
పనిమనిషని చెప్పిన వర్షశ్రీ..
మహేశ్వర్‌రెడ్డి స్వీట్ బాక్స్‌తో పాటు మద్యం బాటిల్ తీసుకువచ్చాడు. అతడు ఇంట్లోకి వస్తున్న సమయంలో ముందు గదిలో ఉన్న శంకరమ్మ అలికిడి గమనించింది. కంటి చూపు సరిగా లేక ఎవరు వచ్చారని వర్షను అడగ్గా.. పని మనిషి వచ్చిందని చెప్పింది. సుమారు 2:30కి మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో శంకరమ్మ మరోసారి ఎవరని ప్రశ్నించినా వర్షశ్రీ బదులివ్వలేదు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్షశ్రీ సోదరుడికి ఫోన్ చేసి ఏడుస్తూ అస్పష్టంగా మాట్లాడింది. సుమన్ హుటాహుటిన నల్లకుంట నుంచి ఇంటికి చేరుకున్నాడు.
వేర్వేరు గదుల్లో ఉరి వేసుకున్నట్లు..
ఇంట్లోకి ప్రవేశించిన సుమన్ మొదటి బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న మహేశ్వర్‌రెడ్డిని గమనించాడు. వర్షశ్రీ ఆచూకీ లేకపోవడం, మరో బెడ్‌రూమ్ లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులను గట్టినా తన్నడంతో గడియ విరిగి అవి తెరుచుకున్నాయి. అక్కడ బెడ్‌పై వర్షశ్రీ పడి ఉండటాన్ని గమనించాడు. మంచం పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్‌కు చీర కట్టి... అది ఆమె మెడకు చుట్టి ఉంది. ముక్కులో నుంచి రక్తం కారడంతో పాటు నుదుటిపై కమిలిన గాయాలున్నాయి.
ఇద్దరి మెడలకు ఉన్న చీరల్ని కట్ చేసిన సుమన్ ‘108’కి సమాచారం ఇచ్చాడు. 3.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీలను పరిశీలించి ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వర్షశ్రీని ఓ దుప్పటిలో పెట్టి మొదటి అంతస్తు నుంచి కిందికి తీసుకువస్తుండగా.. ఆమెలో కదలికల్ని కుటుంబీకులు గుర్తించారు. అప్రమత్తమైన వారు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దాదాపు గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆస్పత్రికి తరలించే లోగా కన్నుమూసింది.
ఆచూకీ లభించని మద్యం బాటిల్..
మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీ మధ్య కొంతకాలంగా స్నేహం ఉందని యువతి కుటుంబీకులు చెప్తున్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఉంటుందని, ఆవేశానికి లోనైన మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటా డని పోలీసులు భావిస్తున్నారు. ఇది చూసి భయపడిన వర్షశ్రీ మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని తలను గోడకు బాదుకోవడంతో పాటు సోదరుడికి ఫోన్ చేసి ఉంటుందని, ఆ తర్వాత కిటికీ గ్రిల్‌కు ఉరి వేసుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహేశ్వర్‌రెడ్డి తీసుకువచ్చిన స్వీట్ బాక్స్ అతడి మృతదేహం వద్దే ఉన్నా.. మద్యం బాటిల్ ఆచూకీ లభించలేదు. మరోవైపు మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేప్పుడు వర్షశ్రీ ఏం చేస్తోంది? ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అనేది అంతుచిక్కట్లేదు. వర్షశ్రీపై మహేశ్వర్‌రెడ్డి చేయి చేసుకున్నాడా? ఈ కారణంగానే ఆమె ఉన్న గదిలోంచి బయటకు వచ్చి మరో గదిలో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే సందేహాలను పోలీసులు వెలిబుచ్చుతున్నారు.
హత్యే అంటున్న యువకుడి కుటుంబీకులు..
మహేశ్వర్‌రెడ్డి మృతిపై సమాచారం అందుకున్న అతడి కుటుంబీకులు వర్షశ్రీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆమె కుటుంబీకులంతా వచ్చేశారు. ఈ సమయంలో రెండు కుటుంబాల మధ్యా ఘర్షణ జరగడంతో ఓ దశలో యువకుడి కుటుంబీకులపై యువతి కుటుంబ సభ్యులు దాడికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు వారిని ఠాణాకు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మహేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా, వర్షశ్రీ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలకు తరలించారు. మహేశ్వర్‌రెడ్డిది ముమ్మాటికీ హత్యేనంటూ అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్వర్‌రెడ్డి తీసుకొచ్చిన స్వీట్స్‌లో ఏమైనా కలిపాడా? అనే అనుమానంతో వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతే ఈ ఉదంతంపై స్పష్టత వస్తుందని అధికారులు చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment