‘ఈ–పెట్టీ’.. నేరాల కట్టడి | New App In Siddipeta | Sakshi
Sakshi News home page

‘ఈ–పెట్టీ’.. నేరాల కట్టడి

Published Mon, Jul 9 2018 10:18 AM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

New App In Siddipeta - Sakshi

ఈ పెట్టీ యాప్‌ పనితీరు పరిశీలిస్తున్న పోలీసులు 

సిద్దిపేటటౌన్‌: నిత్యం రద్దీగా ఉండే సుభాష్‌రోడ్డులో ఉన్న ప్రతీ దుకాణం నిర్వాహకులు వారి ఎదుట ఉన్న రోడ్డుపై సామాను ఉంచడం, పాదచారులకు ఇబ్బంది కలిగించడం నిత్యకృత్యం. పోలీసులు ఎంత చెప్పినా, ఎన్ని సార్లు జరిమానా వేసిన వ్యాపారులు మాత్రం మారలేదు.

ఈ–పెట్టీ యాప్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం పోలీసులు సుభాష్‌ రోడ్డులో తిరుగుతూ రోడ్డును ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న దృశ్యాన్ని ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసి జరిమానా విధించారు. అప్పటి నుంచి ఆ రోడ్డులో వ్యాపారాలు నిర్వహించే దుకాణాదారులు రోడ్డుపై సరుకులు పెట్టడం తగ్గించారు.

ఏదైనా సంఘటన జరుగుతోందని పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడి పరిస్థితిని నమోదు చేసుకుని నేరం తీవ్రత పెరగకుండా చేయాలన్న లక్ష్యంతో వినియోగంలోకి తెచ్చిన ‘ఈ–పెట్టీ’ కేసుల యాప్‌తో నేరాలను కట్టడి అవుతున్నాయి.

ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం, ప్రజల జీవనానికి భంగం కలిగించే కేసులను నమోదు చేయడంపై దృష్టి పెడుతున్నారు. నేరం తీవ్రత పెరగకుండా పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఈ–పెట్టీ కేసు నమోదు చేస్తున్నారు. 

అమలులో రాష్ట్రంలోనే రెండవ స్థానం...

మారుతున్న సాంకేతిక పరాజ్ఞానాన్ని నేరస్తులు అందిపుచ్చుని కొత్త కొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. వారికి దీటుగా పోలీసు శాఖ సాంకేతికంగా మరింత అడ్వాన్స్‌గా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 13న ఈ–పెట్టీ కేసుల యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది.

యాప్‌ను వినియోగంలోకి తెచ్చిన 64 రోజుల్లోనే 1267 కేసులు నమోదు చేయడం గమనార్హం. ఈ–పెట్టీ యాప్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ నిలిచింది.

బహిరంగంగా దూమపానం, మద్యం సేవించడం, పేకాట ఆడడం, తాగి గొడవలు పెట్టుకోవడం వంటి సంఘటనలు జరిగినపుడు ఎక్కడిక్కడే ట్యాబ్‌లో సంబంధిత దృశ్యాలు అప్‌లోడ్‌ చేయడంతో పాటు పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు.

దీంతో నిందితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వారిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. వివరాలను ట్యాబ్‌లో ఎంట్రీ చేయగానే కోర్టులో ప్రవేశపెట్టి నేరం పెద్దదైతే శిక్ష వేస్తున్నారు. లేదంటే జరిమానాతో విధిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ–పెట్టీ యాప్‌ పోలీసులకు ప్రధాన ఆయుధంగా మారింది. 

టౌన్‌ న్యూసెన్స్‌పై ఎక్కువ దృష్టి...

ఈ–పెట్టీ యాప్‌ ద్వారా టౌన్‌లో న్యూసెన్స్‌ యాక్డు ప్రకారం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం వంటి ఘటనలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.

నేరస్తుని ఫొటో, నేరం జరిగిన తీరు, సంఘటన స్థలం దృశ్యం, నేరస్తుని పూర్తి వివరాలు ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఒక నేరస్తుడు మళ్లీ ఎప్పుడైనా నేరం చేస్తూ పట్టుబడితే అతని వివరాలు ఇంతకుముందే నమోదు అయి ఉండడంతో మరో కేసు అతని ఖాతాలో నమోదు అవుతుంది.

ఇలా పాత నేరస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట ఉంచుతున్నారు. దీంతో కొన్ని సార్లు నేరం చేసిన వ్యక్తి ఎవరో తెలయికుంటే ఈ యాప్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

26 స్టేషన్‌లు...59 ట్యాబ్‌లు

జిల్లాలో ఉన్న 26 పోలీస్‌ స్టేషన్‌లలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వోలు), కోర్టు కానిస్టేబుల్లు, బ్లూకోర్ట్‌ కానిస్టేబుల్స్‌కు మొత్తం 59 ట్యాబ్‌లు పంపిణీ చేసారు. ప్రధానంగా ఈ కేసులను ఎస్సైలు, ఏఎస్సైలు, సీఐలు నేరం జరిగిన స్థలంలోనే నమోదు చేస్తున్నారు.

దీంతో కేసులు నమోదు చేయడం సులభంగా మారింది. జిల్లాలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం, జూదం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, గొడవలు పెట్టుకోవడం, వంటి వాటిలో కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఘటనల్లో దొరికిన వారిపై సంఘన స్థలంలోనే కేసులు నమోదు చేస్తూ రశీదులు ఇచ్చి కోర్టుకు హాజరయ్యేలా చేస్తున్నారు.

నేర రహిత కమిషనరేట్‌ దిశగా...

ఏ నేరాన్నైనా తొలిదశలోనే అరికట్టడమే ఈ–పెట్టీ యాప్‌ ప్రధానం లక్ష్యం. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు ఈ యాప్‌ ఎంతో దోహదం చేస్తుంది. సాంకేతికతను ఉపయోగించుకుని నేరాలను అదుపు చేసి కమిషనరేట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

టౌన్‌ న్యూసెన్స్‌ కలిగించే వారి వివరాలు తెలిపితే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తాం. ఆధారాలతో సహా కేసులు నమోదు అవుతుండడంతో నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. –జోయల్‌ డేవిస్, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement