
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరువనంతపురం : కేరళలో నవవరుడిని భార్య తరపు బంధువులు కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేశారు. మన్ననం వద్ద కొత్తగా పెళ్లయిన కెవిన్ పీ జోసెఫ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చి తెన్మెల ప్రాంతం వద్ద మృతదేహాన్ని పడవేశారని సోమవారం పోలీసులు వెల్లడించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దారుణ ఘటన చోటుచేసుకుందని జోసెఫ్ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బాధితుడి భార్య తొలుత ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పది మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
కెవిన్‌తో పాటు అతని బంధువు అనీష్‌నూ కిడ్నాప్ చేశారని..తీవ్రంగా హింసించిన అనంతరం అతడిని విడిచిపెట్టారని పోలీసులు చెప్పారు. గాయాలతో ప్రస్తుతం అనీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కెవిన్ ఇటీవల ఎత్తుమన్నూర్‌లోని రిజిస్ర్టార్ ఆఫీస్‌లో ఓ మహిళను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో సంప్రదింపులు జరిగిన మీదట భర్తతోకలిసివెళ్లేందుకే యువతి మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలోనే నవవరుడి హత్య జరగడంతో పరువు హత్యగా భావిస్తున్నారు.
మూడు వారాల్లోగా ఈ హత్యపై నివేదిక సమర్పించాలని కేరళ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. మరోవైపు కెవిన్ జోసెఫ్ హత్యను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)చే దర్యాప్తు జరిపించనున్నట్టు ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment