మంచినీళ్లు తెచ్చేలోపే..  | One Year Child Dead In Khammam District | Sakshi
Sakshi News home page

మంచినీళ్లు తెచ్చేలోపే.. 

Published Fri, Aug 9 2019 1:33 PM | Last Updated on Sat, Aug 10 2019 7:51 AM

One Year Child Dead In Khammam District - Sakshi

మృతి చెందిన చిన్నారి శ్రీహాన్‌

సాక్షి, ఖమ్మం: తన చేతితో గోరు ముద్దలు తినిపించిన కొడుకు కనురెప్పపాటులో విగతజీవిగా మారాడు. అప్పటి వరకు తనతో ఆటలాడిన ఆ చిన్నారి ఇకలేడని తెలిసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. గత నెలలోనే ఆ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. నెలతిరిగేలోపులోనే గారాబంగా పెంచుకుంటున్న ముద్దులొలికే చిన్నారి కానరాని లోకాలకు వెళ్తాడని ఊహించని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఏనుగుతల నరేష్‌ వ్యాపారం చేస్తూ భార్య లాస్య, ఇద్దరు కుమారులతో జీవిస్తున్నారు.

గురువారం ఉదయం లాస్య తన చిన్న కుమారుడైన శ్రీహాన్‌ (13నెలలు)కు రెండో అంతస్తులోని పోర్టికోలో అటు ఇటు తిప్పుతూ ఇడ్లీ తినిపిస్తోంది. మధ్యలో మంచినీరు తెచ్చేందుకు శ్రీహాన్‌ను పోర్టికోలో కూర్చోబెట్టి లోపలికి వెళ్లింది. ఆమె మంచినీళ్లు తెచ్చేలోపే శ్రీహాన్‌ ఆడుకుంటూ వెళ్లి గ్రిల్స్‌ ఎక్కి కింద పడిపోయాడు. గమనించిన లాస్య ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టుకుంటూ కిందకు వచ్చింది. భవనం పై నుంచి పడడంతో తలకు బలమైన గాయమై శ్రీహాన్‌ అప్పటికే స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆమె కుటంబ సభ్యులకు తెలపగా.. విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు 
ఎప్పుడూ తమ ఒడిలో ఆడుకుంటూ వచ్చీరాని మాటలతో అమ్మనాన్న అంటూ పలుకుతూ ఉన్న తమ బిడ్డ విగతజీవిగా ఆసుపత్రి నుంచి తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని చూసి తండోపతండాలుగా చేరుకున్న స్థానికులు కంటతడి పెట్టారు. గత నెలలోనే పుట్టినరోజుకు వచ్చి ఆ చిన్నారికి తమ ఆశీస్సులు అందజేసిన వారు మృతదేహాన్ని చూసి పుట్టినరోజు వేడుకలను గుర్తు తెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement