క్రైమ్ సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ పినాకి మిశ్రా
బరంపురం: బరంపురం, నగర పరిసర ప్రాంతాల్లో జరిగిన వివిధ నేరాలకు సంబంధించిన 30మంది కరుడుగట్టిన నేరస్తులు హిట్‌లిస్ట్‌లో ఉన్నారని ఎస్పీ పినాకి మిశ్రా తెలిపారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో మండలి స్థాయి క్రైమ్ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ పినాకి మిశ్రా మాట్లాడుతూ..బరంపురం నగరంలో ఇటీవల జరిగిన పలు నేరాలకు సంబంధించిన 30మంది కరుడుగట్టిన నేరస్తులు ఇతర రాష్ట్రలకు పారిపోయి తలదాచుకున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు.
నగరంలో వివిధ హత్యలు, దాదా బట్టీలు, హత్యాయత్నాలు, దోపిడీలు చేసి పోలీసుల నుంచి తప్పించుకుని సూరత్, ముంబై, గుజరాత్, అహ్మదాబాద్, నాసిక్, పూణే, హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపారు.
ఇటువంటి నేరస్తులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని తయారు చేసినట్లు చెప్పారు. నగరంలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా నేరాలను అదుపు చేసేందుకు అపరాధి ముఖి అభియాన్ పేరుతో ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రజలకు, సమాజానికి పోలీసులు జవాబుదారీ తనంగా విధులు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పలు వేషాల్లో నేరస్తులు
నగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు వివిధ వేషాలలో తిరుగుతున్నారని, ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినట్లు కనబడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై తగు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు త్రినాథ్ పటేల్, సంతున్ దాస్, ఎస్‌డీపీఓ ప్రభాత్ చంద్ర రథ్, పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ ఐఐసీ సురేష్ త్రిపాఠి, ట్రాఫిక్ ఐఐసీ సుమన్ కిషన్, టౌన్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అశోక్ కుమార్ మహంతి, బీఎన్‌పూర్ ఐఐసీ జె.కె.పట్నాయక్, గుసానినువగాం ఐఐసీ కులమణి శెట్టి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment