సాక్షి,ముంబయి: భారతీయ జైళ్లు తనను నిర్భందించేందుకు అనువైనవిగా ఉండవన్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా అభ్యంతరాలను మహారాష్ర్ట సర్కార్ తోసిపుచ్చింది. యూరప్‌లోని ఏసీ జైళ్లకు దీటుగా ముంబయి అర్దర్ రోడ్ జైల్ యూనిట్ నెంబర్ 12లో సకల సౌకర్యాలున్నాయని రాష్ర్ట ప్రభుత్వం జైలు ఫోటోలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపింది. కోట్లాది రూపాయల రుణ ఎగవేత కేసులో నిందితుడు మాల్యా బ్రిటన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. 2008 ముంబయి ఉగ్ర దాడిలో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను ఉంచేందుకు ప్రత్యేకంగా అర్ధర్ రోడ్ జైలులో యూనిట్ 12ను నిర్మించారు. ఇదే బ్యారక్‌లో భారత్‌కు తరలించే విజయ్ మాల్యాను ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము జైలు వసతులతో కూడిన పూర్తి సమాచారంతో అవసరమైన పత్రాలను జతచేసి కేంద్రానికి నివేదిక పంపామని మహారాష్ర్ట అడిషనల్ డీజీపీ (జైళ్లు) బీకే ఉపాథ్యాయ్ చెప్పారు.
బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో మాల్యాను తమకు అప్పగించాలని ఈడీ దాఖలు చేసిన కేసులో మాల్యా తరపు న్యాయవాది భారత జైళ్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మాల్యా డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ఇంట్లో వండిన ఆహారాన్నే అందించాల్సి ఉంటుందని బ్రిటన్ కోర్టుకు నివేదించారు. జైళ్లలో మరుగుదొడ్ల సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు కొరవడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాల్యా దోషిగా తేలేంత వరకూ కోర్టు ఉత్తర్వులతో ఆయనకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు జైలులో ఏర్పాట్లు చేస్తామని మాల్యా న్యాయవాది వాదనలను తోసిపుచ్చుతూ మహారాష్ర్ట హోంశాఖ కేంద్రానికి నివేదించింది.
కేసులో దోషిగా తేలిన తర్వాతే మాల్యాకు జైలు మ్యాన్యువల్ వర్తిస్తుందని ఈ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. అవసరమైతే మాల్యా కోసం యూరోపియన్ శైలిలో టాయిలెట్‌ను నిర్మిచేందుకు జైలు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు, అర్ధర్ రోడ్డు జైలులో తామిప్పటికే సీనియర్ సిటిజన్ నిందితుల కోసం యూరప్ తరహా టాయిలెట్లను నిర్మించామని అధికారులు తెలిపారు. యూనిట్ నెంబర్ 12లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం కొన్ని గదులున్నాయని, మాల్యా వీటిని ఉపయోగించుకోవచ్చని లేకుంటే ఆయనకు ప్రత్యేకంగా నిర్మిస్తామని హోంశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment