ఇస్లామాబాద్ : ఉద్యోగం వదిలివేయలేదనే ఆగ్రహంతో పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్‌ను ఆమె భర్త కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ఏడు నెలల కిందటే వీరి వివాహం జరగ్గా ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఉరూజ్ ఇక్బాల్ (27) ఉర్దూ పత్రికలో పనిచేస్తోంది. సెంట్రల్ లాహోర్‌లోని కిలా గుజ్జర్ ప్రాంతంలోని తన కార్యాలయంలోకి ఆమె ప్రవేశించిన క్రమంలో జర్నలిస్టుగా పనిచేసే ఆమె భర్త దిలావర్ అలీ నేరుగా ఆమె తలపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఉరూజ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు.
కాగా, మరో ఉర్దూ పత్రికలో పనిచేస్తున్న ఆమె భర్త దిలావర్ అలీపై ఉరూజ్ సోదరుడు యాసిర్ ఇక్బాల్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.ఏడు నెలల కిందట తమ సోదరి అలీని ప్రేమించి పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచి ఆమెను అలీ వేధింపులకు గురిచేస్తున్నాడని, ఉద్యోగం మానేయాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదులో ఇక్బాల్ పేర్కొన్నారు. అలీపై తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఈ ఘాతుకం జరిగిందని చెప్పారు. భర్త తీరుతో విసిగిపోయిన తమ సోదరి ఉర్దూ పత్రిక కార్యాలయ భవనం పక్కనే ఓ గదిలో ఉంటోందని ఇక్బాల్ తెలిపారు. కాగా హత్య జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం పరిశీలిస్తున్నామని, కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment