ఇక్కడ ఇక్రమ్‌.. అక్కడ ప్రశాంత్‌ | Pakistani Ikram case on the limelight | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఇక్రమ్‌.. అక్కడ ప్రశాంత్‌

Published Thu, Nov 21 2019 4:57 AM | Last Updated on Thu, Nov 21 2019 5:16 AM

Pakistani Ikram case on the limelight - Sakshi

ఇక్రమ్, ప్రశాంత్‌

పాకిస్తాన్‌లో పొరపాటున అడుగుపెట్టి బందీగా మారిన విశాఖ యువకుడు ప్రశాంత్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళ కోసం అక్రమ మార్గంలో పాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఏడాదిగా ఖైదీగా ఉన్న ఇక్రమ్‌ కేసు తెరపైకి వచ్చింది. ఇతను ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉండగా, నాంపల్లి కోర్టులో కేసు విచారణ ముగియగానే పాక్‌కు డిపోర్టేషన్‌ (బలవంతంగా తిప్పి పంపడం) చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.    
– సాక్షి, హైదరాబాద్‌

దుబాయ్‌లో ప్రేమ.. పెళ్లి
పాతబస్తీకి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌ పరిచయమయ్యాడు. తాను భారతీయుడినని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి, ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన ఆమె హైదరాబాద్‌ వచ్చేశారు.

ఆమెను వెతుక్కుంటూ హైదరాబాద్‌కు..
2011లో ఇక్రమ్‌ సదరు మహిళను వెతుక్కుంటూ, దుబాయ్‌ నుంచి నేపాల్‌ వరకు విమానంలో వచ్చాడు. ఆపై రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి, అట్నుంచి హైదరాబాద్‌ చేరాడు. ఆరు నెలల తరువాత ఇక్రమ్‌ అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలిసి ఆమె అతడిని దూరం పెట్టారు. కక్షగట్టిన ఇక్రమ్‌ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించి, వాటిని కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానని బెదిరించాడు. డబ్బివ్వకపోతే ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్‌ సందేశం పంపాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, అధికారులు గతేడాది జూన్‌లో ఇక్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇలా బయటపడింది..
ఇక్రమ్‌ అరెస్టయినపుడు.. మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థలో టెన్త్‌ నుంచి డిగ్రీ చదివినట్టున్న సర్టిఫికెట్లు, అబ్బాస్‌ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర గుర్తింపుకార్డులు, పాక్‌ పాస్‌పోర్ట్‌కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతి స్వాధీనమయ్యాయి. సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వాస్తవానికి ఇక్రమ్‌ 2009 వరకు పాక్‌ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. దీంతో ఇతడి వద్ద ఉన్నవి బోగస్‌ పత్రాలని, వాస్తవానికి పాక్‌ జాతీయుడని నిర్ధారించడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విదేశీ మంత్రి త్వ శాఖ (ఎంఈఏ) ద్వారా పాక్‌ ఎంఈఏకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ ఇచ్చిన జవాబు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చేరింది. దీంతో ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలయ్యా యి. ఈ కేసు విచారణ ముగిసి, అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందేనని ఎంఈఏ నుంచి అందిన ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కోర్టులో కేసు పెండింగ్‌ లేకుండా డిస్పోజైన వెంటనే అతడిని ఢిల్లీలోని పాక్‌ ఎంబసీలో అప్పగిస్తామని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement