లాస్ ఏంజిలిస్ : హాలీవుడ్ దర్శకనిర్మాత బ్రెట్ రాట్నర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళా దర్శకురాలు పాటీ జెంకిన్స్ తీవ్రంగా స్పందించారు. రాట్నర్, నటాశా హెన్ స్ట్రింగ్, ఒలివియా మన్ సహా ఆరుగురు నటీమణులపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.
తన చేతుల మీదుగా ఇటీవల అవార్డు తీసుకున్న డైరెక్టర్ ఇలాంటి నీచ పనులను పాల్పడతాడని ఊహించలేదన్నారు. రాట్నర్ పై ఆరోపణలు విని ఎంతో ఒత్తిడికి లోనయ్యానంటూ ట్విట్టర్ లో ఆమె ఓ లేఖ పోస్ట్ చేశారు. రాట్నర్ ను కలిసినప్పుడు నాకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకున్నాను. అదృష్టవశాత్తూ ఆ సమయాల్లో రాట్నర్ నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన రాట్నర్ తప్పులను మాత్రం క్షమించేది లేదన్నారు.
ప్రపంచంలో ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన వారికి మనం మద్ధతు తెలపాలన్నారు. అదే సమయంలో కీచక డైరెక్టర్ రాట్నర్ కు శిక్షపడేలా చూడాలని పిలుపునిచ్చారు. నిజాలను నిర్భయంగా భయపటపెట్టిన బాధితురాళ్ల ధైర్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నట్లు మహిళా దర్శకురాలు జెంకిన్స్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇటీవల జేవిష్ నేషనల్ ఫండ్ వారు నిర్వహించిన ఓ ఈవెంట్లో 'వండర్ ఉమన్' దర్శకురాలు జెంకిన్స్ చేతుల మీదుగా ట్రీ ఆఫ్ లైఫ్ అవార్డును రాట్నర్ అందుకున్నారు. తన చేతుల మీదుగా అవార్డ్ తీసుకున్న వ్యక్తి ఇలా వేధింపులకు పాల్పడ్డాడంటే నమ్మశక్యంగా లేదన్నారు పాటీ జెంకిన్స్.
Comments
Please login to add a commentAdd a comment