శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ,గూడూరు: నగదు లావాదేవీలకు సంబంధించిన కేసులో నిందితుడు, నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లే యత్నం చేయడంతో అతనికి సంబంధించిన బందువులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. పట్టణానికి చెందిన వినోష్ అనే యువకునికి, గూడూరు రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలు భర్త మధురెడ్డికి నగదు విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. ఈ క్రమంలో వినోష్‌తోపాటు అతని సోదరుడు, చిల్లకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే అఖిల్‌పై కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో అఖిల్ మంగళవారం ఆస్పత్రి రోడ్డులోని ఓ దుకాణం వద్ద ఉండగా ఒకటో పట్టణ పోలీసులు అతడ్ని ఎస్సై పిలుస్తున్నారని, స్టేషన్‌కు రావాలని కోరారు. అఖిల్ స్పందిస్తూ తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఉందని, తాను స్టేషన్‌కు ఎందుకు రావాలని వారితో అన్నారు.
దీంతో వారు ఎస్సై సుధాకర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని సిబ్బందితో కలిసి అఖిల్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అఖిల్ బంధువులు అడ్డుకున్నారు. అఖిల్ రోడ్డు ప్రమాదంతో నడిచే స్థితిలో కూడా లేడని, అయినా ఈ కేసు కోర్టులో ఉందని తెలిపారు. పైగా అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఉందని, మీరెలా తీసుకెళతారని వాగ్వాదానికి దిగారు. ఎస్సై వినకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారే పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అనంతరం అఖిల్ తల్లి, పిన్నమ్మ సుదర్శన, మణి మాట్లాడుతూ అధికారపార్టీ వారికి తాము రూ.17 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే రూ.12.30 లక్షలు చెల్లించి ఉన్నామని, పోతే రూ.5 లక్షలలోపే ఇవ్వాలని తెలిపారు. అయితే మరో వ్యక్తికి ఇచ్చిన మొత్తాన్ని కూడా తామే ఇవ్వాలని, లేదంటే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తామని అధికార పార్టీకి చెందినవారు కావడంతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిల్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన ఎస్సైను అడ్డుకుంటున్న బంధువులు
Comments
Please login to add a commentAdd a comment