కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ.. నిజమే! | Person Done KTR Forgery In Nalgonda | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ.. నిజమే!

Published Sat, Oct 19 2019 9:44 AM | Last Updated on Sat, Oct 19 2019 9:44 AM

Person Done KTR Forgery In Nalgonda  - Sakshi

సాక్షి, నల్లగొండ : పోస్టింగ్‌ కోసం ఫోర్జరీ... నిజమేనని తేలింది. విద్యాశాఖలో ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ పోస్టింగ్‌ కోసం మంగళ అనే హెడ్‌మాస్టర్‌ ఏకంగా మంత్రి కేటీఆర్‌ సంతకాన్నే ఫోర్జరీ చేసి రికమెండ్‌ లెటర్‌ను జిల్లా విద్యాశాఖాధికారికి అందించింది. ఈ విషయంపై ఈనెల 4న ‘సాక్షి’ మినీలో ‘పోస్టింగ్‌ కోసం ఫోర్జరీ’ శీర్షికన కథనాన్ని ప్రచురితమైంది. మంత్రి సంతకం ఫోర్జరీ చేసిన లేఖను కూడా ప్రచురించింది.

అయితే లేఖపై కేటీఆర్‌ సంతకం చేశారా.. లేక ఫోర్జరీనా అన్న అంశాన్ని తేల్చేందుకు కలెక్టర్‌తోపాటు జిల్లా విద్యాశాఖాధికారి ఇరువురు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. దీంతో విచారించిన ఉన్నత విద్యాశాఖ.. సంతకం ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. ఓపెన్‌ స్కూల్‌ పోస్టింగ్‌ కోసం మంగళనే ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు గుర్తించారు.

దీంతో ఉన్నత విద్యాశాఖ జిల్లా విద్యాశాఖాధికారికి శుక్రవారం మెయిల్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో విద్యాశాఖాధికారి సరోజినీదేవి ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులకు మంత్రి కేటీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారని మంగళపై ఫిర్యాదు చేశారు. 

ఫోర్జరీ వ్యవహారాన్ని బయటపెట్టిన సాక్షి
జిల్లా విద్యాశాఖలో జరిగిన ఈ బాగోతాన్ని ‘సాక్షి’ తగిన ఆధారాలతో బయటపెట్టింది. విద్యాశాఖ పరిధిలోని ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న రావుల పెంట హైస్కూల్‌కు చెందిన హెడ్‌మాస్టర్‌ మంగళను నెల రోజులక్రితం ఆ పోస్టు నుంచి తప్పించాలనుకున్నారు. అదే క్రమంలో సూర్యాపేట జిల్లా నుంచి మరో ఉపాధ్యాయుడికి ఇన్‌చార్జ్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. జిల్లా మంత్రి సూచనల మేరకు ఆ ఉపాధ్యాయుడిని ఇన్‌చార్జిగా నియమించినట్లు సమాచారం.

ఈ క్రమంలో మంగళ ఏకంగా జిల్లా మంత్రిని కాదని, అంతకంటే పై స్థాయిలో ఉన్న కేటీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన నల్లగొండ ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌గా మంగళను రికమెండ్‌ చేస్తున్నట్లుగా లెటర్‌ సృష్టించి డీఈఓకు అందజేశారు. దీంతో ఆమె అదే పోస్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘సాక్షి’... కేటీఆర్‌ సంతకాన్ని మంగళ ఫోర్జరీ చేసిన విషయాన్ని బట్టబయలు చేసింది.

దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉలిక్కిపడింది. వాస్తవంగా సాక్షి కథనం ప్రచురించిన నాడే కేటీఆర్‌ పేషీ ఆ లేఖను ఫోర్జరీ చేశారని రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందించింది. అయినప్పటికీ కలెక్టర్‌ దానిపై విచారణకు రాసి విద్యాశాఖ ఉన్నతాధికారులనుంచి సమాచారం అందిన తర్వాతే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు ఫోర్జరీ అని తేలు స్తూ డీఈఓకు సమాచారం ఇవ్వడంతో మంగళపై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళపై కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement