వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం కిష్టాపురం ఎక్స్ రోడ్డు వద్ద గత నెల 17వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సమీప బంధువే సూత్రధారిగా వ్యవహరించి కిరాయి వ్యక్తులతో ఘాతుకానికి ఒడిగట్టినట్టు విచారణలో వెల్లడైంది. ఈ హత్య కేసులో సూత్రధారితో పాటు మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గురువారం స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ వై. వెంకటేశ్వర్‌రావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.
మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మల్‌రెడ్డి శివారెడ్డి కుటుంబానికి సమీప బంధువు అయిన మోర్తాల పద్మ, ఆమె భర్త సీతారాంరెడ్డి కుటుంబానికి 20 ఏళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఆ వివాదం కోర్టులో నడుస్తుండగా మోర్తాల పద్మ పేరుతో కిష్టాపురం గ్రామ శివారులో గల భూమిని కొన్నేళ్ల క్రితం కోర్టు ద్వారా శివారెడ్డి కుటుంబం స్వాధీనం చేసుకున్నారు. కక్ష పెంచుకుని.. రూ. లక్షలు విలువ చేసే రెండెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని సీతారాంరెడ్డి కుటుంబం శివారెడ్డి కుటుంబంపై కక్ష పెంచుకుంది.
శివారెడ్డి అడ్డు తొలగించుకుంటే భూమిని స్వాధీనం చేసుకోవచ్చనే దురుద్దేశంతో సీతారాంరెడ్డి పథకం రచించాడు. అందుకు తన స్నేహితుడైన ఇజ్రాయిల్‌ను ఆశ్రయించాడు. అతను అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన కలకొండ సత్యం అనే వ్యక్తిని పరిచయం చేశాడు. వీరు ముగ్గురు కలిసి పథకం వేసి కలకొండ సత్యం ద్వారా కిరాయి వ్యక్తులకు రూ. 3.6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత అక్టోబర్ 17వ తేదీన కిరాయి వ్యక్తులు కొత్తపల్లి కళ్యాణ్, గుంజ వెంకన్న, వీర్ల మల్లేశ్ బైక్‌లపై వచ్చి శివారెడ్డిని కత్తి, గొడ్డలితో దారుణంగా హత్య చేశారు.
పట్టుబడ్డారు ఇలా..
శివారెడ్డిని హత్య చేసిన అనంతరం కొత్తపల్లి కళ్యాణ్, గుంజ వెంకన్న, వీర్ల మల్లేశ్‌లు పట్టణంలోని ఈదులగూడ చౌరస్తాలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. ఒప్పందం ప్రకారం రూ.3.6 లక్షలు ఇవ్వాలని సీతారాంరెడ్డికి ఫోన్ చేశారు. అయితే అప్పటికే శివారెడ్డి కుటుంబం సీతారాంరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. వెంటనే సీతారాంరెడ్డి కదలికలపై నిఘా పెట్టడంతో సుపారీ ఇచ్చేందుకు వెళ్లగా హత్య చేసిన ముగ్గురితో పాటు సీతారాంరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో పాత్రదారులుగా వ్యవహరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ వివరించారు.
నిందితులు వీరే
మల్‌రెడ్డి శివారెడ్డి హత్య కేసులో మిర్యాలగూడ పట్టణం విద్యానగర్‌కు చెందిన దుర్గంపూడి సీతారాంరెడ్డి, అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన కలకొండ సత్యం, హౌసింగ్‌బోర్డుకు చెందిన కొత్త కళ్యాణ్, డిండి మండలం బొగ్గుల దొన((పస్తుతం మిర్యాలగూడలోని హౌసింగ్‌బోర్డు)కు చెందిన గుంజ వెంకన్న, మిర్యాలగూడ మండలం అవంతిపురానికి చెందిన వీర్ల మల్లేష్, కడియం గురువయ్య అలియాస్ ఇజ్రాయిల్, విద్యానగర్‌కు చెందిన మోర్తాల పద్మ, మిర్యాలగూడ మండలం అవంతిపురానికి చెందిన మాక్టింగ్ డ్రైవర్ చనిమోల్ల మహేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
త్రిపురారం మండలం రాగడప గ్రామానికి చెందిన అద్దంకి దుర్గా ప్రసాద్, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడేనికి చెందిన గట్టిగొర్ల లింగయ్య, మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన వల్లపు బాలా మల్లు, మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన బచ్చలకూరి నరేష్, మాటూరు గ్రామానికి చెందిన దనావత్ నాగు పరారీలో ఉన్నట్లు డీఎస్‌పీ తెలిపారు. వీరి నుంచి కత్తి, గొడ్డలితో బైక్, కారు, రూ.3.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్‌బాబు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment