అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యకాండ సాగించిన జేసీ సోదరుల పాపం పండుతోంది. 40 ఏళ్ల క్రితం ఒక్క బస్సుతో మొదలైన ప్రస్థానం.. అక్రమాలతో కోట్లాది రూపాయల మాఫియా సామ్రాజ్యంగా విస్తరించింది. తాజాగా బీఎస్–3 లారీలను బీఎస్–4గా మార్చి ఎంతో మందిని ముంచిన ఘటన వెలుగులోకి రాగా.. ఏకంగా పోలీసుల సంతకాలనే ఫోర్జరీ చేసిన ఘటన కటకటాల్లోకి నెట్టింది.
సాక్షి, అనంతపురం : ఏ బస్సులను అడ్డం పెట్టుకొని ఇంత కాలం అక్రమాలకు పాల్పడ్డారో, అదే బస్సుల కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి జైలు పాలయ్యారు. ఒక పర్మిట్‌తో రెండు మూడు బస్సులు తిప్పడం, ఆర్టీసీని నష్టాలపాలు చేస్తూ అనుమతిలేని రూట్లలోనూ బస్సులు తిప్పిన ఘటనలు కోకొల్లలు. ఇదే సమయంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాయి. తాజాగా బస్సుల విక్రయం కేసులో ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించిన ఘటన జేసీ సోదరుల మూలాలను కదిలిస్తోంది. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల(ఏపీ02టీసీ9666, టీఎస్09యుబీ7034) విక్రయానికి సంబంధించి పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్‌ఓసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.
అనంతరం వీటిని తెలంగాణలో విక్రయించారు. అయితే, తమకు దరఖాస్తు చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్లు అని గుర్తించిన రవాణాశాఖ అధికారులు అనంతపురం 1వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆరుగురిపై క్రైం నెంబర్ 28/2020.. 420, 467, 468, 471, 472, 120 బీ, 201 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో శనివారం ఉదయం అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు రెండు బృందాలుగా హైదరాబాద్‌కు వెళ్లి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. మరికొన్ని కేసుల్లో తదుపరి విచారణ నిమిత్తం వన్‌టౌన్ పోలీసులు నేడో రేపో పీటీ వారెంట్ వేయనున్నట్లు తెలిసింది. చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్..హైడ్రామా!
మొత్తం 25 కేసులు
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల పేరు మీద జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కో కంపెనీలు నిర్వహిస్తున్నారు. జఠాధర ఇండస్ట్రీస్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి డైరెక్టర్లు. అదేవిధంగా సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీకి జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, చవ్వా గోపాల్ రెడ్డితో పాటు మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలను అడ్డం పెట్టుకుని దివాకర్ ట్రావెల్స్ భారీ అక్రమాలకు పాల్పడడంతో డీటీసీ ఫిర్యాదు మేరకు పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. ఇందులో తాడిపత్రిలోనే 17 కేసులు ఉండగా.. అనంతపురం వన్‌టౌన్‌లో 8 కేసులు ఉన్నాయి.
తుక్కు లారీలతోనూ మోసం
బీఎస్–3 శ్రేణి వాహనాలను 2017 మార్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు, రిజిస్ట్రేషన్‌లు చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్లి ఒకేసారి 154 వాహనాలను జఠాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీతో సి.గోపాల్‌రెడ్డి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత బీఎస్–3 శ్రేణి వాహనాలను బీఎస్–4 వాహనాలు రిజి్రస్టేషన్ చేయించి తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు.
వీటిలో 101 వాహనాలు ఆంధ్రపదేశ్‌లో, 33 కర్ణాటకలో, 15 తెలంగాణలో, 3 నాగాలాండ్‌లో, ఒక్కొక్కటి చొప్పున తమిళనాడు, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆయాప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేయించారు. మనరాష్ట్రంలో 79 వాహనాలు అనంతపురం జిల్లాకు, 8 వాహనాలు నెల్లూరు జిల్లాకు, 5 వాహనాలు చిత్తూరు జిల్లాకు, 3 కడప జిల్లాకు, 2 గుంటూరు జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. మరికొన్నింటిని గుర్తించాల్సి ఉంది. జిల్లాలో ఉన్న వాహనాల్లో ఇప్పటి వరకూ 53 వాహనాలను సీజ్ చేశారు. చదవండి: జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి
టీడీపీ నాయకుల ఓవరాక్షన్
వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ చోటా నాయకులు ఓవరాక్షన్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టగా పోలీసులు టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఆ పార్టీ నాయకులు బండారు శ్రావణి, బి.వెంకట్రాముడు, ఉమామహేశ్వర నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసేందుకు స్టేషన్‌కు వచ్చారు. కానీ పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. చివరకు జేసీ పవన్‌కుమార్ రెడ్డి స్టేషన్ నుంచి బయటకు వచ్చి వారితో మాట్లాడి వెళ్లిపోయారు.
కేసులో నిందితులు
ఏ1 – జేసీ ఉమారెడ్డి
ఏ2 – జేసీ ప్రభాకర్ రెడ్డి
ఏ3 – నాగేంద్ర
ఏ4 – బాబయ్య
ఏ5 – జేసీ విజయ (జేసీ దివాకర్ రెడ్డి సతీమణి)
ఏ6 – జేసీ అస్మిత్ రెడ్డి (వీరిలో ఇది వరకే నాగేంద్ర, బాబయ్యను అరెస్టు చేయగా.. ప్రస్తుతం జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. )
అరెస్ట్ పర్వం ఇలా..
ఉదయం 5.30 : జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలింపు
11.07 : అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తండ్రీకుమారులు
మధ్యాహ్నం 2.43 : వైద్య చికిత్సల నిమిత్తం సర్వజనాసుపత్రికి..
3.09 : తిరిగి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు..
5.20 : జడ్జి ఎదుట హాజరు
5.45 : రెడ్డిపల్లి సబ్‌జైలుకు తరలింపు
6.02 : రెడ్డిపల్లి సబ్‌జైలులోకి..
రాత్రి 7.05 : సబ్‌జైలులో ఇటీవల కరోనా కేసు నిర్ధారణ నేపథ్యంలో తిరిగి అనంతపురం వన్‌టౌన్ స్టేషన్‌కు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment