మౌనిక, తులసీరామ్ దంపతులు (ఫైల్)
ధారూరు: ఉద్యోగమొచ్చి ఏడాదైంది.. పెళ్లయి నెల దాటింది.. అంత సంతోషంగా ఉన్నామనుకున్న సమయంలో ఆ కుటుంబాన్ని విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో చేతికొచ్చిన కొడుకును బలి తీసుకోగా, కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఓ నవ వధువు పుట్టెడు దుఃఖంలో మునిగింది. దీంతో ధారూరు మండలం లక్ష్మీనగర్‌తండాలో తీవ్ర విషాదం అలుముకుంది. లక్ష్మీనగర్‌తండాకు చెందిన వాల్యానాయక్, హేమ్లీబాయి దంపతులకు దేవీబాయి, తులసీరామ్ (29), గోపాల్, శ్రీనివాస్ సంతానం. డిగ్రీ పూర్తి చేసిన రెండో కుమారుడు తులసీరామ్ 2018లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవరంపల్లి ఠాణాలో విధులు నిర్వహిస్తుండేవాడు. తులసీరామ్‌కు మే 8వ తేదీ, 2019లో పూడూరు మండలం బొంగుపల్లితండాకు చెందిన మౌనికతో వివాహమైంది. అయితే పీఎస్ పరిధిలో జరిగిన ఓ కేసు విషయమై నిందితుడిని పట్టుకోవడానికి బీహార్‌కు అధికారులు, సిబ్బందితో తులసీరామ్ వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరామ్ దుర్మరణం పాలయ్యాడు. దీంతో లక్ష్మీనగర్ తండాలో తీవ్ర విషాదం ఏర్పడింది. కుటుంబసభ్యుల రోదనలతో తండా తల్లడిల్లింది.
రోదిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు
మిన్నంటిన రోదనలు
ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్‌కు గత మే 8వ తేదీన వివాహమైంది. వివాహమైన 34 రోజులకే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో నవ వధువు దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదం వార్త తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కొత్తగా పెళ్లవడంతో మైలార్‌దేవరంపల్లిలో ఈ దంపతులు కొత్త కాపురం పెట్టారు. కాపురం పెట్టిన కొన్నాళ్లకే ఆయన మృతిచెందడంతో అతడి భార్య దు:ఖసాగరంలో మునిగింది. ఎదిగిన కుమారుడు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు పుత్రశోకంలో మునిగారు.
Comments
Please login to add a commentAdd a comment