వివరాలు సేకరిస్తున్న టూటౌన్ సీఐ శ్రీనివాసాచారి, పట్టుబడిన నగదు, కాయిన్స్ డబ్బాలు
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా క్లబ్‌పై పోలీసుల దాడులు జిల్లాకేంద్రంలో కలకలం రేపింది. పట్టణ నడిబొడ్డున ఉన్న జిల్లా క్లబ్‌లో డబ్బులు పందెంగా ఏర్పాటు చేసుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్, ఎస్‌బీ డీఎస్పీ గిరిబాబు, డీటీసీ డీఎస్పీ సాయిప్రసాద్, టూటౌన్ సీఐ శ్రీనివాసాచారి సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేయడం జరిగింది. దీంతో కాయిన్స్ పెట్టుకొని మూడు ముక్కలాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు బందిగ శివప్ప, ఉప్పల లక్ష్మయ్య, కేటీ సుదర్శన్, మల్లేశ్, దశరథం, మదన్‌మోహన్‌రెడ్డితోపాటు క్యాష్ కౌంటర్ మేనేజర్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేశారు. అలాగే క్లబ్ కౌంటర్‌లో ఉన్న రూ.1,24,660 నగదు సీజ్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నట్లు ముందస్తు సమాచారం తెలుసుకున్న కొందరు పెద్దలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. జిల్లా క్లబ్‌లో పేకాట ఆడటానికి కోర్టు అనుమతి ఉన్న దానికి విరుద్ధంగా ఆడుతున్నట్లు తెలుస్తోంది.
అనుమతి తుంగలో తొక్కారు
గతంలో జిల్లా క్లబ్‌పై పోలీసులు దాడులు చేయడంతో దీనిపై అప్పట్లో ఉన్న పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించి కొన్ని నిబంధనలతో కూడిన పేకాట ఆడుకోవచ్చని ఆర్డర్ తెచ్చుకున్నారు. రమ్మీ, 13 కార్డ్స్ మాత్రమే ఆడాలని ఇందులో కూడా టేబుల్స్‌పై నగదు ఉండరాదని చెప్పింది. దీంతో పేకాట ఆడుతున్న గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానిని నేరుగా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని సూచించింది. దీంతో అలాంటి నిబంధనలు పాటించకుండా క్లబ్ కౌంటర్‌లో డబ్బులు కట్టి కాయిన్స్ తెచ్చుకొని పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పేకాట ఆడాలని భావించిన ప్రతి ఒక్కరు ఎన్ని వేలు అయినా కౌంటర్‌లో కట్టి దానికి ప్రతిఫలంగా కాయిన్స్ తీసుకోవాలి. దీంట్లో గెలుపొందిన వ్యక్తులకు కాయిన్స్ పరిశీలించి దాని ప్రకారం కౌంటర్ నిర్వాహకులు గెలుపొందిన వ్యక్తులకు నగదు చెల్లిస్తారు.
రాత్రివేళలోనే అధికంగా..
జిల్లాకేంద్రంలోని జిల్లా క్లబ్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో కాయిన్స్ పెట్టి భారీస్థాయిలో మూడు ముక్కలాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో రాజకీయ పెద్దల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతిఒక్కరు ఉంటారని తెలుస్తోంది. ఈ దాడులు ఏదో రాత్రివేళలో చేసి ఉంటే పెద్ద మనుషులు అందరూ పట్టుబడే వాళ్లని చర్చించుకుంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రూ.300 నుంచి రూ.500లోపు ఆడేవారు మాత్రమే ఉంటారని సమాచారం. రూ.వేలు, లక్షలు పెట్టి ఆడేవారు సాయంత్రం 6 గంటల తర్వాతే క్లబ్ చేరుకుంటారని తెలుస్తోంది. పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడులు చేస్తే రూ.లక్షల్లో నగదు లభ్యమవుతుందని ప్రచారం.
కాయిన్స్ పెట్టి పేకాట
జిల్లా క్లబ్‌లో నూతనంగా ఏర్పాటు అయిన గేమింగ్ యాక్టు ప్రకారం డబ్బులు పెట్టి లేదా వాటిస్థానంలో కాయిన్స్ పెట్టి పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు క్లబ్‌లో భారీస్థాయిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతుండగా దాడులు చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.1,24,660 నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. దీంతోపాటు డిస్ట్రిక్ క్లబ్‌లో చట్టవిరుద్ధంగా డబ్బులతో పేకాట ఆడుతున్న నేపథ్యంలో సంబంధిత కమిటీ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట కానీ ఇతర జూదం ఆడటం చట్టప్రకారం నేరమని ఇలాంటి కార్యకళాపాలు ఎక్కడ జరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment