కీర్తన (ఫైల్ )రోడ్డుపై పడి ఉన్న కీర్తన మృతదేహం
అభంశుభం తెలియని పదో తరగతి బాలిక ప్రేమోన్మాది కొడవలికి బలైంది. బాలిక తనతో మాట్లాడడం లేదని, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్న ఓ యువకుడు వెంటాడి ప్రాణాలు తీశాడు. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా దాడి చోటుచేసుకుంది.
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: బాలికను ఓ సైకో పట్టపగలు నడిరోడ్డుమీద తెగనరికి చంపాడు. తన ప్రేమను కాదన్నందుకు అమాయకపు బాలికను నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నాడు. బ్యాగ్ తగిలించుకుని ఉత్సాహంగా పాఠశాలకు బయలుదేరిన ముద్దుల కూతురు దారుణ హత్యకు గురైందని తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘోర విషాదం దొడ్డ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
ఎలా జరిగిందంటే..
పట్టణ శివారులోని బసవేశ్వర నగర్‌లో నివసిస్తున్న నందీశ, లలిత దంపతుల రెండవ కూతురు కీర్తన (15) హత్యకు గురైన చిన్నారి. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న గార పని చేసే నవీన్ (28) ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కీర్తన పట్టణంలోని బీఎస్‌ఏ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి ఇంటికి సమీపంలోనే టీకొట్టు నడుపుకుంటూ ముగ్గురు కూతుర్లను చదివిస్తున్నాడు. బుధవారం ఉదయం 8–30 సమయంలోకీర్తన పాఠశాలకు బయలుదేరింది. అక్కడే కాపు కాసిన నవీన్.. కొడవలితో బాలికను తీవ్రంగా నరికాడు. కీర్తన అక్కడే కుప్పకూలి ప్రాణం వదిలింది. దుండగున్ని అడ్డుకోబోయిన స్థానికులను నవీన్ కొడవలితో బెదిరించాడట.
పెళ్లి చేయాలని ఒత్తిళ్లు
కీర్తన అక్క వైశాలి, హంతకుడు నవీన్ తమ్ముడు ప్రవీణ్‌కుమార్ ఏడాది క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. అలా ఇరు కుటుంబాలకు బంధుత్వం ఏర్పడింది. తరచూ కీర్తన ఇంటికి వచ్చే నవీన్ బాలికలను తనకిచ్చి వివాహం చేయాలని వారిని ఒత్తిడి చేసేవాడు. అతడు చెడు వ్యసనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతుండడంతో కీర్తన తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. అయినా అతడు బాలికను పాఠశాలకు వెళ్లేసమ యంలో వెంటాడి వేధించేవాడు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని స్థానికులు కొన్నిసార్లు దేహశుద్ధి చేశారు. ఒకసారి పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలిపించి వార్నింగ్‌లు ఇప్పించారు. అతని వ్యవహారాలు తెలిసి బాలిక కూడా ఇష్టపడేది కాదు. దీంతో కసి పెంచుకున్నారు.
విషం తాగినట్టు డ్రామా
హత్య చేసిన నవీన్ బసవ భవనం వద్దకు వెళ్లి (ఇంటికి సమీపంలోనే) విషం తాగినట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.కుటుంబ సభ్యులు వచ్చేసరికి నవీన్ సొమ్మసిల్లి పడిపోయినట్టు నటించాడు. తక్షణం అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పోలీసులు చికిత్స చేసి ప్రమాదమేమీ లేదని తేల్చిచెప్పారు. పోలీసులు ఆ మృగాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment