అనంతపురం – రాయదుర్గం మార్గంలో తిరిగే ఆ బస్సులంటే అందరికీ దడే. మితిమీరిన వేగం, ఓవర్ టేక్‌తో దూసుకొచ్చే ఆ బస్సులను చూస్తే మిగతా వాహనదారులు, పాదచారులు హడలెత్తి పోతున్నారు. ఏ సమయంలో ఎవరిని ప్రమాద రూపంలో బలిగొంటుందోనని భయపడిపోతున్నారు.
ఆత్మకూరు: ఆదాయమే పరమావధిగా ‘దివాకర్ ట్రావెల్స్’ బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ బస్సులకు అడ్డంగా నిలిపి మరీ ప్రయాణికులను ఎక్కించుకుంటోంది. కలెక్షన్ కోసం రోడ్డు నిబంధనలను ఉల్లంఘించేస్తోంది. మితిమీరిన వేగంతో అవతలి వాహనాల వారికి ప్రాణభయం పుట్టిస్తోంది. ముందు వెళుతున్న వాహనాలను దాటడం కోసం ఓవర్‌టేక్ చేసేస్తోంది. రెప్పపాటులో డ్రైవర్లు స్టీరింగ్ తిప్పేస్తుండటంతో లోపలున్న ప్రయాణికులు ఒక్క ఉదుటున సీట్లలోంచి కదులుతున్నారు. ఈ బస్సు వచ్చే తీరును చూస్తే ‘మృత్యువు’ దూసుకొచ్చినట్టే కనిపిస్తుందని పలువురు వాహనదారులు చెబుతున్నారు.
ర్యాష్ డ్రైవింగ్‌తో తరచూ ప్రమాదాలు
అనంతపురం నుంచి ఆత్మకూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గంతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ప్రతి రోజూ ‘దివాకర్ ట్రావెల్స్’ తన బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ బస్సుల కన్నా దివాకర్ బస్సులే ఈ మార్గంలో అధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు చేస్తున్నాయి. ఈ నెల మూడో తేదీన ఆత్మకూరు సమీపంలో బొలెరో వాహనాన్ని దివాకర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆత్మా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డీపీడీ) ఎన్.వి.రమణ (50) దుర్మరణం చెందాడు. గత నెలలో ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కామారుపల్లి వద్ద దివాకర్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌కు వైద్య ఖర్చులకు కూడా ట్రావెల్స్ నిర్వాహకులు సాయం చేయకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు గత నెల 21న గ్రామస్తులతో కలిసి దివాకర్ బస్సులను అడ్డుకున్నాడు. తమకు నష్టపరిహారం చెల్లించి మీ బస్సులు తిప్పుకోండి అంటూ డిమాండ్ చేశారు. ఇలా.. ప్రస్తుతం దివాకర్ బస్సులకు సంబంధించి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.
పరిమితికి మించి ప్రయాణం
దివాకర్ బస్సులలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. ఈ విషయ తెలిసినా అధికారులు కన్నెత్తి చూడరు. ప్రమాదాలు జరుగుతున్నా వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోరు. ఈ బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని అతివేగంతో వెళ్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment