
సుబేదారిలోని అక్షయ్ టిఫిన్ సెంటర్, (ఇన్‌సెట్‌లో) భోజనంలో వచ్చిన ఎలుకను చూపుతున్న బాధితుడు
హన్మకొండ అర్బన్: ‘కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి..’ అని ఆకలి ఎక్కువైతే చెప్పేందుకు వాడే జాతీయం. కానీ వరంగల్ నగరంలోని ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు దంపతులు ఏమరుపాటుగా ఉంటే కడుపులోకి నిజంగానే ఎలుక పోయే పరిస్థితి ఏర్పడింది.
వారు భోజనం చేస్తుండగా వంకాయ కూరలో కలిసిపోయిన చనిపోయిన కలేబరాన్ని గుర్తించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి పక్కనగల అక్షయ టిఫిన్ సెంటర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఆందోళనకు గురైన అతడు హోటల్ నిర్వాహకులను నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మొత్తం వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో విషయం వైరల్ అయింది.
అనారోగ్యంతో వచ్చి..
వరంగల్‌కు చెందిన రమేష్ తన భార్య చంద్రకళ నరాల సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో రోహిణి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన అతడు ఆకలిగా ఉండటంతో తాను భోజనం చేసి భార్యకు పార్సిల్ తీసుకెళ్దామని పక్కనే ఉన్న అక్షయ టిఫిన్స్‌కు వెళ్లాడు.
భోజనం ఆర్డర్ చేసి తింటుండగా వంకాయ కూరలో ఎలుక కనిపించింది. అనుమానంతో బయటకు తీసి చూడగా కూరలో బాగా ఉడికినట్లు సగం తోలు ఊడిన ఎలుక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన రమేష్ మిగతా వారిని కూడా తినవద్దని సూచించాడు.
విషయం నిర్వాహకులకు తెలిపాడు. అయితే బాధితుడి ఆందోళనపై నిర్వాహకుల నుంచి చాలా సేపటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు. అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పాడు.
బాధితుడి ఆందోళనతో హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. విషయం తెలుసుకుని హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లేక ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. ఈ విషయమై హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలుగడ్డలు, ఇతర కూరగాయల బస్తాలు, సామగ్రి కిచెన్‌లో ఉన్నందున పొరపాటు జరిగి ఉండొచ్చన్నారు.
హోటల్ సీజ్, రూ.10 వేల జరిమానా ట్రేడ్ లైసెన్స్ రద్దు.. ల్యాబ్‌కు నమూనాలు : గ్రేటర్ ఎంహెచ్‌ఓ రాజారెడ్డి
వరంగల్ అర్బన్: అక్షయ టిఫిన్ సెంటర్‌లో వంకాయ కర్రీలో మృతిచెందిన ఎలుక వెలుగు చూడటంతో గ్రేటర్ ఎంహెచ్‌ఓ రాజారెడ్డి, సిబ్బంది తనీఖీలు నిర్వహించారు. టిఫీన్ సెంటర్‌కు రూ.10 వేల జరిమానా విధించి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి, ఆహార నమూనాలను సేకరించి సిబ్బంది ద్వారా ల్యాబ్‌కు పంపించారు.
ఈ సందర్భంగా ఎంహెచ్‌ఓ రాజారెడ్డి సంఘటన వివరాలను వెల్లడించారు. వంట గది అధ్వాన్నంగా ఉన్నందున సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదన్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment