ఆమె అంగడి బొమ్మ? | Revanged Porn Hikes In Karanataka | Sakshi
Sakshi News home page

ఆమె అంగడి బొమ్మ?

Published Tue, Jun 19 2018 7:43 AM | Last Updated on Tue, Jun 19 2018 7:43 AM

Revanged Porn Hikes In Karanataka - Sakshi

ప్రేమ బంధం తెగిపోతే.. సమస్యలే

నిమేష్‌ బక్షి (23)అనే యువకుడు ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. తనతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఆమె ఫోటోలను అతడు అశ్లీల వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేశాడు. బాధితురాలి ఇంట్లో గగ్గోలు చెలరేగింది. నిందితునిపై కేసు నమోదై జైలు శిక్ష పడింది.

ఇద్దరూ ప్రైవేటు రంగంలో ఉన్నతోద్యోగులు. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కొన్నినెలలుగా దూరంగా ఉంటోంది. దీంతో అతనిలోని సైకో నిద్రలేచాడు. ఆమె ఫోటోలను నెట్‌లో పోస్ట్‌ చేసి అసభ్య రాతలతో పాటు ఫోన్‌ నెంబర్‌ కూడా పెట్టాడు. దీంతో బాధితురాలికి నరకం మొదలైంది. ఆ ఘరానా భర్త కటకటాల పాలయ్యాడు.  

ఇలాంటి కేసులు ఈ రెండే కాదు... ఎన్నో ఉన్నాయి. అప్పటివరకు సాగిన బంధంలో పొరపొచ్ఛాలు రాగానే కథ మలుపు తిరుగుతుంది. భర్తలు/ ప్రియులు తమ భాగస్వాముల పర్సనల్‌ ఫోటోలను నెట్‌లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఐటీ రంగానికి పేరుపొందిన బెంగళూరులో కొంతకాలంగా ఈ ఇలాంటి పెడధోరణలు ప్రబలుతున్నాయి.

బొమ్మనహళ్లి:  టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో, నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో అశ్లీల ప్రతీకారం (రివెంజ్‌ పోర్న్‌) కేసుల సంఖ్య పెరుగుతుండడం పోలీసులను కలవరపెడుతోంది. విడాకులు తీసుకున్న భార్యలు, ప్రేమ వికటించి దూరమైన ప్రియురాళ్లు వీటి బారిన పడి మానసిక క్షోభకు గురవుతున్నారు. కొందరూ ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్య చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టాడు. ఆమె ఫోన్‌కు పదపదే అపరిచితులు ఫోన్లు చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఖాకీలు మాజీ భర్తను కటకటాల వెనక్కు పంపారు. మాజీ ప్రియురాళ్లకు సంబంధించి అశ్లీల చిత్రాలను ఇలా పోస్ట్‌ చేయడం లాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సొంత కుటుంబం లేదా సమాజం నుంచి చీత్కారాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో చాలా మంది యువతులు లేదా మహిళలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. సిలికాన్‌ సిటీలో ఇలాంటి కేసులు ప్రతి నెలా పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి.

అది మానసిక రుగ్మతే
అశ్లీల చిత్రాలను పోర్న్‌ సైట్లలో పెట్టడం మానసిక వికృతత్వంలో ఒక భాగమని మానసిక నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక పురోగతి.... గిట్టనివారి పరువు తీయడాన్ని సులభతరం చేసిందని సీనియర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ రోషన్‌ జైన్‌ తెలిపారు. వదంతులు, అబద్ధాలు, శృంగార చిత్రాలను విశ్వవ్యాప్తం చేయడం కూడా ఇప్పుడు చాలా తేలికగా మారిందని పేర్కొన్నారు. దీని వల్ల బాధితులు తీవ్ర మానసిక అస్వస్థతకు లోనవుతారని, ఈ చిత్రాలతో కుటుంబంలో రేకెత్తే గొడవల వల్ల కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులకు సంబంధించి బాల్యంలో లేదా పెద్దయ్యాక ఉండే మానసిక రుగ్మతలు కొందరిని ఇలా పెడదారి పట్టిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు.

తక్షణం పోలీసులను సంప్రదించాలి
ఇలాంటి ఉచ్చులో చిక్కుకున్న మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే తమను సంప్రదించాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే తమ పరువు పోతుందనో మరే ఇతర భయాల వల్లనో అనేకమంది బాధిత మహిళలు తమకు ఫిర్యాదు చేయడానికి జంకుతుంటారని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు పూర్తి గోప్యతను పాటిస్తారని, మహిళలు భయపడాల్సిన  అవసరం లేదని నగర పోలీసు కమిషనర్‌ టీ. సునీల్‌ కుమార్‌ తెలిపారు. బాధిత మహిళలు ఫిర్యాదు చేయకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు మరితంగా చెలరేగిపోతారని, చట్టమంటే కూడా భయం లేకుండా తమ పని సాగిస్తూనే ఉంటారని ఆయన హెచ్చరించారు.– సునీల్‌కుమార్, పోలీస్‌ కమిషనర్‌

దొరికిపోతారు జాగ్రత్త
చెత్త పోస్ట్‌లు పెట్టేవారు దొరక్కుండా పోరు. ఆన్‌లైన్‌లో రివెంజ్‌ పోర్న్‌లను పోస్ట్‌ చేసే వారిని, వారి కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ ఐపీ అడ్రస్‌ ద్వారా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని ఇలాంటి పనులు చేసిన ఎంతోమంది విద్యావంతులు, యువత జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుని మగ్గిపోతున్నారు. ఇలాంటి నేరాల్లో కనిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement