లంపకలోవ సహకార సంఘంలో బోగస్ పాస్ పుస్తకాలపై విచారణ చేస్తున్న ప్రత్తిపాడు తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, రెవెన్యూ అధికారుల బృందం, విచారణలో గుర్తించిన బోగస్ పాస్ బుక్‌లు
సాక్షి, రాజమహేంద్రవరం: డీసీసీబీ అక్రమాలు ఓ పక్క ఒక్కొక్కటి వెలుగు చూస్తుంటే మరోవైపు పలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో లొసుగులు బయటపడుతున్నాయి. డీసీసీబీ వేదికగా జరగిన అక్రమాలు తవ్వే కొద్దీ మరిన్ని నిధుల దుర్వినియోగాలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్తిపాడు మండలం లంపకలోవ సహకార సంఘంలో పది కాదు...యాభై కాదు...వంద కాదు ఏకంగా 167 బోగస్ పాస్ బుక్కులను అడ్డుపెట్టుకుని రూ.1.67 కోట్ల మేర అడ్డదారిలో బినామీ రుణాలు పొందేసిన లొసుగుల గుట్టురట్టయింది. తాజా మాజీ డీసీసీబీ చైర్మన్ వరపుల రాజా ప్రాతినిధ్యం వహించిన లంపకలోవ సహకార సంఘంలో రూ.1.67 కోట్ల మేర బోగస్ పాస్ బుక్కుల ద్వారా దుర్వినియోగం కావడం...ఆ తప్పిదాలు అటు ‘51’ విచారణలోనూ...ఇటు రెవెన్యూ బృందం విచారణలోనూ బయటపడుతుండంతో డీసీసీబీ అక్రమాల చిట్టా చేంతాడులా ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సహకార శాఖలో కీలకమైన 51 విచారణ కొనసాగుతోంది. ఇదే సంఘంలో రైతులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నెంబర్ల వివరాలతో ఉండే పాస్ బుక్కులను బోగస్‌వి సృష్టించి లేని రైతుల పేర్లతోనో...అసలు భూములే లేని రైతుల పేర్లతోనో రుణాలు తీసేసి సంఘం నిధులను పథకం ప్రకారం పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారంపై ప్రత్తిపాడు తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, పది మంది వీఆర్వోలు ఆ సంఘంలో బుధవారం కేవలం పాస్‌బుక్కులపై విచారణ చేపట్టారు. ఈ సంఘ పరిధిలో మొత్తం 217 పాస్ బుక్కులుండగా అందులో 192 పాస్ బుక్కులపై విచారణ చేపట్టారు. విచారణాంతరం అందులో 167 పాస్ బుక్కులు బోగస్‌వని రెవెన్యూ అధికారుల బృందం నిర్ధారించింది.
ఈ సంఘంలో గతం నుంచీ జరిగిన అక్రమాలు విచారణలో వెలుగు చూస్తున్నాయని, సంఘం త్రిసభ్య కమిటీ తరఫున కూడా గత లొసుగులను గుర్తించి విచారణాధికారులు ముందు ఉంచుతామని లంకపలోవ సంఘం త్రిసభ్య కమిటీపర్సన్ ఇన్‌ఛార్జి గొంతెన సురేష్ తెలిపారు. సాక్షాత్తు గత డీసీసీబీ చైర్మన్ రాజా హయాంలోనే లంపకలోవ సంఘంలో ఇంతటి భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరగడంతో ఈ విచారణలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లంకపలోవ సంఘంలో బోగస్ పాస్ పుస్తకాలపై విచారణ చేపట్టినట్లుగానే రెవెన్యూ అధికారుల బృందం ఏలేశ్వరం, శంఖవరం, కిర్లంపూడి మండల్లాలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని సంఘాల్లోనూ గురువారం విచారణ చేపట్టనుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment