సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో గడచిన ఐదేళ్లలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. బ్యాంక్ సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసిన విషయం ప్రాథమికంగా నిర్దారణ కావడంతో సహకార చట్టాల్లో పాశుపతాస్త్రంగా పరిగణించే సెక్షన్–51ను ప్రయోగించింది. సహకార చట్టాల్లో ఈ సెక్షన్‌కు ఉన్న ప్రాధాన్యం మిగిలిన ఏ సెక్షన్‌కూ లేదు. ఇది అక్రమార్కులకు సింహస్వప్నం. అటువంటి సెక్షన్‌తో విచారణ ప్రారంభం కావడంతో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు సహా డీసీసీబీలో అన్ని స్థాయిల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగినా ప్రధాన బాధ్యుడైన సీఈఓతోనే పోదని, తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళన డీసీసీబీ అధికారులకు గుబులు పుట్టిస్తోంది. చైర్మన్ రాజా, సీఈఓ ధర్మారావు లక్షల మంది నమ్మకాన్ని దెబ్బతీసి డీసీసీబీకి గండికొడతారా, ఇది ధర్మమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకో ణంపై సెక్షన్ 51 విచారణకు ఆదేశించడంతో ఈ సెక్షన్ ఏమి చెబుతోంది? విచారణలో దీని పాత్ర ఏమిటి? విచారణ అనంతరం పరిణామాలు ఎలా ఉం టాయి? అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మెక్కిన సొమ్మును కక్కిస్తుంది
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా, డీసీసీబీలో చాలా తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడే మాత్రమే అరుదుగా ఈ సెక్షన్‌ను వినియోగిస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో డీసీసీబీలో జరిగిన అవకతవకలపై సెక్షన్–51 వేయడం డీసీసీబీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సహకార బ్యాంక్‌లు, సంఘాల్లో లొసుగులు, లోతులను నిశితంగా కనుగొనే అవకాశం సెక్షన్ 51కి మాత్రమే ఉంది. సహకార చట్టం, సహకార బ్యాంక్‌ల బైలా, సంఘాల నిబంధనల అమలులో ఎక్కడైనా పాలకవర్గాలు, అధికారులు దారితప్పి నిధులను మింగేస్తే దారిలో పెట్టడమే కాకుండా, మెక్కిన నిధులను కక్కించే అధికారం కూడా ఈ విచారణకే ఉంది.
అంతిమంగా నిగ్గు తేల్చడానికి...
1964లో రూపొందిన సహకార చట్టం ద్వారా సెక్షన్ 51 ఎంక్వయిరీ మొగ్గ తొడిగింది. సహకార చట్టం ఈ సెక్షన్‌కు విశేషాధికారాలు కట్టబెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే సహకార శాఖలో 51 ఎంక్వయిరీ అంటే తుది తీర్పుగా చెప్పుకోవచ్చు. సహకారశాఖ పరిధిలో నిధులు దుర్వినియోగం అయినప్పుడు తొలుత ప్రా«థమిక విచారణ చేపడతారు. ఆ ప్రాథమిక విచారణలో నిధుల దుర్వినియోగం రూ.కోట్లలో ఉన్నప్పుడు సమగ్ర విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం భావించినప్పుడు అక్రమాలు నిగ్గు తేల్చేందుకు 51 విచారణకు ఆదేశిస్తుంది.
సహకార బ్యాంక్, సహకార సంఘంలో నిధులు దుర్వినియోగం జరిగినప్పుడు తొలుత ప్రాథమిక విచారణ నిర్వహిస్తారు. తర్వాత తనిఖీలు (ఇన్‌స్పెక్షన్లు) నిర్వహించే అధికారం సెక్షన్ 52కు ఉంటుంది. ఈ సెక్షన్‌ను వినియోగించి దుర్వినియోగం అయిన నిధులకు ఆడిట్ ఎలా జరిగింది, నిబంధనలకనుగుణంగానే ఆడిట్‌లు జరిగాయా, ఆడిట్ అభ్యంతరాలను కూడా అతిక్రమించారా వంటి విషయాలు నిర్ధారించేందుకు సెక్షన్ 50 విచారణ జరుగుతుంది. సాధారణంగా ఈ మూడు దశల విచారణలు పూర్తయ్యాకే అంతిమంగా నిధుల దుర్వినియోగం తీవ్రతను బట్టి సెక్షన్ 51 విచారణకు శ్రీకారం చుడతారు. సహకారశాఖ కమిషనర్, రిజిస్ట్రార్, జిల్లా సహకార అధికారులు...ఇలా పలు స్థాయిల్లో అధికారులు అన్ని కోణాల్లో పరిశీలన జరిపి సమగ్ర విచారణ అనివార్యమైనప్పుడు సెక్షన్ 51ని ప్రయోగిస్తారు.
పలు కోణాల్లో శోధించి కుంభకోణం ఛేదించడమే లక్ష్యం
51 విచారణతో 2013 ఫిబ్రవరి నుంచి 2019 మార్చి నెల వరకూ డీసీసీబీ చైర్మన్ రాజా, గత సీఈఓ హేమసుందర్, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు హయాంలో జరిగిన నిధులు దుర్వినియోగంపై లోతైన విచారణకు సమాయత్తమవుతున్నారు. డీసీసీబీ పదవీకాలంలో చివరి రెండు సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ కాలంలో సీఈఓ ధర్మారావు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సహకారశాఖ కమిషనర్ వద్ద పక్కా సమాచారం ఉందంటున్నారు.
ఈ క్రమంలోనే డీసీసీబీలో రుణాలు నిబంధనల మేరకే ఇచ్చారా? రుణాలు తీసుకున్నవారు అర్హులేనా? వారికి రుణాలు తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత ఉందా? రుణాలు తీసుకునే ముందు తనఖా పెట్టిన సాగు భూములు దస్తావేజులు సక్రమంగా ఉన్నాయా లేదా? చనిపోయిన వారి పేరుతో కూడా రుణాలు మంజూరు అయ్యాయా? సహకారశాఖ పేరుతో అధికారులు నిధుల దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారు, అందుకు పాలకవర్గం ఆమోదం సంపూర్ణంగా ఉందా లేదా..? పాలకవర్గ సభ్యుల ప్రయోజనాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందా? తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలతో నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందా? పరపతేతర పేరుతో లేదా, రైతులకు విజ్ఞాన యాత్రల పేరుతో నిధులు మెక్కేశారా? చట్టం, బ్యాంక్‌లు, సంఘాల బైలాకు అనుగుణంగా సీఈఓ నిర్ణయాలు తీసుకున్నారా లేదా, బినామీ పేర్లతో స్వప్రయోజనాల కోసం తీసుకున్నారా? ఇలా పలు కోణాల్లో ఆయా సంఘాలు, బ్యాంక్‌ల్లో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని బట్టి లోతైన విచారణ చేయడం సెక్షన్ 51 లక్ష్యం. అందుకే డీసీసీబీ చైర్మన్, సీఈఓలు అంతగా ఆందోళన చెందుతున్నారంటున్నారు.
విచారణాధికారికి విశేషాధికారాలు..
సెక్షన్ 51 విచారణాధికారికి విశేషాధికారాన్ని కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో విచారణాధికారిగా నియమితులైన అమలాపురం డివిజనల్ సహకార అధికారి బి.దుర్గాప్రసాద్ నిధుల దుర్వినియోగం ఎలా జరిగిందో పరిశీలించడమే కాకుండా అక్రమ వ్యవహారాలను వెలికితీస్తూనే ఆ నిధులు రికవరీ కూడా చేయనున్నారు. నిధులు రికవరీ అయినప్పుటికీ అక్రమార్కులపై చర్యలకు అవసరాన్ని బట్టి సమన్లు కూడా జారీచేసే అధికారం ఈ సెక్షన్ కట్టబెట్టింది. అక్రమార్కులను సస్పెండ్ చేయాలా... విధుల నుంచి పూర్తిగా ఉద్వాసన పలకాలా..? వంటి సూచనలు చేసే అధికారం విచారణాధికారికి ఉంటుంది. నిధులు కాజేసిన వారిపై పక్కా ఆధారాలతో సివిల్ లేదా క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా ఈ సెక్షన్‌లో ఉంది.
ఎంతటి వారినైనా విచారించే అధికారం సెక్షన్ 51కి ఉంది
సహకార శాఖలో నిధులు దుర్వినియోగం అయినప్పుడు ఎంతటి వారినైనా విచారించే సర్వాధికారం సెక్షన్ 51కు ఉంది. విచారణాధికారి బాధ్యులైన వారికి సమన్లు జారీ చేసే అధికారం కూడా ఉంది. సహకార చట్టంలో అత్యంత విశేష అధికారాలు ఒక్క 51కు మాత్రమే ఉన్నాయి. ఈ విచారణకు పరిధులు, పరిమితులు ఉండవు. ఏ కోణంలోనైనా విచారణ చేయవచ్చు. అనుమానాల నివృత్తికి, వాస్తవాల వెలికితీతకు విచారణాధికారి బాధ్యులుగా భావించే వారిని సమగ్రంగా విచారించే అధికారం ఉంటుంది. సహకార శాఖలో సెక్షన్ 51 ఎంక్వయిరీ పడిదంటే ఆ అక్రమాల అంతు అంతిమంగా తేలినట్టు. నిధులు దుర్వినియోగం వెలుగు చూడాల్సిందే.
– మహ్మద్ అమీర్, విశ్రాంత సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment