ఎన్టీఆర్‌నగర్ ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ(ఫైల్)
వాకాటి సన్ని(22) స్థానిక చింతారెడ్డిపాళెంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సన్నీ, అతని స్నేహితులు చెంబేటి రాకేష్, కమతం ప్రభు చింతారెడ్డిపాళెం నుంచి నెల్లూరుకు సొంత పనిమీద బైక్‌పై బయలుదేరారు. చెంతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డును దాటుతుండగా చెన్నై వైపు నుంచి కావలి వైపునకు వెళుతున్న లారీ అతివేగంగా బైక్‌ను ఢీకొనడంతో సన్నీ కిందపడిపోయి తలకు తీవ్ర గాయమైంది. చికిత్సనిమిత్తం హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సన్నీ మృతిచెందాడు.
నెల్లూరు(మినీబైపాస్): స్థానిక జాతీయ రహదారిలోని ఎన్టీఆర్‌నగర్ సర్కిల్, సింహపురి ఆస్పత్రి సర్కిల్ ప్రాంతాల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు రోడ్డు దాటాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు అత్యంత వేగంగా పరుగులు తీస్తుంటాయి. అంతే వేగంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. మితిమీరిన వేగానికి తోడు హైవేపై అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో వాహనచోదకులతోపాటు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ఈ రెండు ప్రాంతాల్లో గత రెండు సంవత్సరాల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రగాయాలపాలయ్యారు. వీటిలో చాలా వరకు హిట్ అండ్ రన్ కేసులే ఉండడం గమనార్హం.
డెత్ వే
ఎన్టీఆర్‌నగర్, సింహపురి హాస్పిటల్ సర్కిళ్ల వద్ద జాతీయ రహదారి పక్కన ఇరువైపులా భారీ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్లలో దూరంలో జాతీయ రహదారి ప్రక్కన ఇరువైపులా విశ్రాంతి ప్రదేశాలు ఏర్పాటు చేసినా నేషనల్ హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఆ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని కారణం వ్యక్తిగత, రవాణా వస్తువులకు భద్రత కొరవడడంతో భారీ వాహనాలచోదకులు విశ్రాంతి లేకుండా ముందుకు సాగుతున్నారు. కొన్నిచోట్ల రహదారి పక్కనే ఉన్న డాబాల వద్ద వాహనాలను ఆపేస్తున్నారు. అధికంగా నిలిచి ఉన్న వాహనాల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి ప్రదేశంలో తప్ప వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలపకూడదనే నిబంధనను నీరుగారుస్తున్నారు. రాత్రి వేళలో కూడా ఈ ప్రాంతాల్లో వాహనాలను హైవేకు ఇరువైపులా ఇండికేషన్‌ను వేయకుండానే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
సీసీ కెమెరాలు లేవు
ప్రధానంగా ప్రమాదానికి కారణమైన వాహనాలు అక్కడి నుంచి పరారవుతున్నాయి. కనీసం ఏవాహనం ఢీకొని మృతిచెందారో తెలియని పరిస్థితి నెలకొంది. సీసీ కెమెరాలు లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో జరిగిన మరణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఎక్కువగా ‘హిట్ అండ్ రన్’ కేసులే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు నివారించే దిశగా చర్యలు చేపట్టడం అవసరమని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రమాదానికి కారణాలివే..
♦ రోడ్డు క్రాసింగ్ సమీపంలో సరైన ప్రమాద సూచికలు తెలిపే ‘కాషన్ బోర్డులు’ లేకపోవడం
♦ రాత్రుల్లో సరైన లైటింగ్ వ్యవస్థ లేకపోవడం
♦ సబ్ వే నుంచి హైవేకు వచ్చే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం
♦ పగలు కనబడే బోర్డులు కాకుండా, రేడియం స్టిక్కరింగ్ కాషన్ బోర్డులు లేకపోవడం
♦ రోడ్డు పక్కన, మధ్యలో డివైడర్లపై పెంచిన మొక్కలు పెరిగిపోవడం, ఈ మొక్కలు నిబంధనల ప్రకారం కొంత ఎత్తువరకు మాత్రమే పెంచాలి.
♦ హైవేఅథారిటీ వారి వద్ద సరైన ఎక్విప్‌మెంట్ లేకపోవడం. ప్రమాదం జరిగినపుడు తక్షణం స్పందించకపోవడం, రికవరీ వాహనాలు లేకపోవడం.
♦ సీసీ కెమెరాలు లేకపోవడం.
♦ రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ లేకపోవడంతో పశువులు రోడ్డు మీదకు వచ్చేస్తుండడం
♦ రోడ్డు మార్జిన్‌లో భారీ వాహనాలను పార్కింగ్ చేయడం.
Comments
Please login to add a commentAdd a comment