బైక్‌ను ఢీకొన్న లారీ ఘటనా స్థలం
కొన్ని గంటల్లో భోగి మంటలు వేసుకుని ఆనందంగా గడపాడాల్సిన ఆ కుటుంబాల్లో పెనువిషాదం నెలకొంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పండగ జరుపుకోవాలని ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి నెల్లూరుకు బయలుదేరిన ముగ్గురిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామీణ ప్రాంతాల్లో విషాదచాయలు అలముకున్నాయి.
నెల్లూరు, సంగం: మరణంలోనూ ఆ ముగ్గురి స్నేహబంధం వీడలేదు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని ర్యాంపు వద్ద నెల్లూరు–ముం బాయి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పెరమన పంచాయతీ మజారా జంగాలదొరువుకు చెందిన సంకె వెంకటేశ్వర్లు (30) హైదరాబాద్‌లో మూడేళ్ల క్రితం శిరీషాను వివాహమాడి అక్కడే ఫిజియోథెరిపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఏడాది పాప ఉంది. భోగి పండగ కావడంతో ఆదివారం ఉదయం భార్య శిరీషా, కుమార్తెతో స్వగ్రామం జంగాలదొరువుకు వెంకటేశ్వర్లు వచ్చాడు. అక్కడి నుంచి బైక్‌లో దగదర్తి మండలం ఊచగుంటపాళెంకు చెందిన రాము (40), కొడవలూరు మండలం రాజుపాళెంకు చెందిన నన్నే సాహెబ్ (40) నెల్లూరుకు బైక్‌లో బయలుదేరారు.
ర్యాంపు వద్దకు వచ్చే సరికి లారీని బైక్ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, నన్నేసాహెబ్, రాము అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని రోదించారు. పండగ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన కుమారుడు వెంకటేశ్వర్లు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పండగ పూట ఆనందంగా గడపాల్సిన తమ కుటుంబంలో భగవంతుడు విషాదం మిగిల్చాడంటూ ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అప్పుడే ఇంటి నుంచి బయలుదేరిన భర్త అంతలోనే మృతి చెందడంతో వెంకటేశ్వర్లు భార్య శిరీషా కుప్పకూలిపోయింది. తన బిడ్డకు తనకు దిక్కెవరూ అంటూ రోదించింది. శిరీషను ఓదార్చడం ఎవరితరం కాలేదు. జంగాలదొరువులో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న నెల్లూరురూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెంకు తరలించారు. ఎస్సై నాగార్జునరెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment