ఇంటి సమీపంలోని దుకాణం వద్ద రూబీ డాగ్
చీరాల రూరల్ : పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని రూ. 2,10,000 నగదుతో పాటు 13 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక హరిప్రసాద్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఆర్‌కే ఓరియంట్ స్కూల్ ఎదురుగా మచ్చా అంకయ్య అనే రిటైర్డు ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగేళ్లుగా వారి బంధువులకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో భార్య భర్తలు ఇంటికి గడియపెట్టి ఆరుబయట నిద్రించారు. ఆయన చిన్న కుమారుడు డాబాపై పడుకున్నాడు. ఇంటి యజమాని అంకయ్య రాత్రి 12:30 గంటల సమయంలో మంచినీళ్లు తాగేందుకు నిద్రలేచాడు.
అప్పటికి కూడా ఇంట్లో దొంగతనం జరగలేదు. సుమారు ఒకటిన్నర ప్రాంతంలో పక్క పోర్షన్‌లో అద్దెకుండే సామ్రాజ్యం అనే మహిళ డాబాపై నిద్రిస్తూ రోడ్డుపై గొడవగా జరుగుతుండటంతో డాబా దిగి కిందికి వచ్చింది. అంకయ్య ఇంటి గడియతీసి ఉండటంతో పాటు అతని ఇంట్లో లైట్లు వెలుగుతుండడంతో అంకయ్య అతని భార్యను సామ్రాజ్యం నిద్రలేపింది. దీంతో వారివురు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. మెయిన్ హాల్‌లో ఉంచిన బీరువా తెరుచుకుకని దానిలోని గిల్డ్ నగలు మంచంపై చిందరవందరగా పడి ఉండటం గమనించారు. వెంటనే పూజ గదిలోని బీరువాను కూడా పరిశీలించారు. ఆ బీరువా కూడా తెరచి ఉండటంతో బీరువాలోని వస్తువులను క్షుణ్ణగా పరిశీలించి సొత్తు అపహరణకు గురైనట్లు గుర్తించి బావురుమన్నారు.
బీరువాలోని లాకర్లో..
ఇంటికి సంబంధించి కుటుంబ పరమైన కొన్ని పనుల నిమిత్తమై అప్పుగా తెచ్చుకుని దాచుకున్న రూ. 2 లక్షల నగదు, 13 సవర్లు బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. అలానే అంకయ్య చొక్కా జేబులోని రూ. 6,800 నగదు, ఆయన కుమారుడు కిషోర్ జేబులోని రూ. 3,500 కూడా పోయాయి. నగదు, బంగారు ఆభరణాలు దాచి ఉంచిన బీరువాలో అధిక మొత్తంలో పట్టు చీరలు, విలువైన వస్తువులు మాత్రం అలానే ఉన్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, రూరల్ సీఐ పి. భక్తవత్సల రెడ్డి, ఎస్సై ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వద్ద వివరాలను సేకరించారు.
రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్
సంఘటన స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించారు. సంఘటనా స్థలంలోని ప్రతి వస్తువును వారు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రూబీ డాగ్ సంఘటనా స్థలంలో వాసన చూసి ఇల్లంతా కలియ తిరిగి డాబాపైకి వెళ్లింది. కిందికి దిగిన డాగ్ మళ్లీ కొద్ది సేపు ఇల్లంతా తిరిగింది. పక్క పోర్షన్‌లో నివాసముండే సామ్రాజ్యం ఇంట్లోకి కూడా వెళ్లింది. అక్కడి నుంచి బయటకు వచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద నుంచి రైలు పట్టాల పక్క రోడ్డు మీదుగా గేటు సెంటర్ వరకు వెళ్లింది. అక్కడ కొద్దిసేపు తిరిగి బ్రిడ్జిపై మెట్లు ఎక్కి రోడ్డుపైకి చేరింది. మళ్లీ కిందకి దిగిన డాగ్ సంఘటన జరిగిన ఇంటివద్దకు వచ్చి ఆగిపోయింది. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఓ అపరిచిత వ్యక్తిని వెంబడించినట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment