
సాక్షి, హైదరాబాద్ : యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం ఉదయం తెల్లవారుజామున 3 - 4 గంటల మధ్య ప్రాంతంలో ఈ దోపిడి జరిగినట్లు సమచారం. వివరాలు.. బెంగళూర్ నుంచి హైదరాబాద్ వస్తోన్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ మహబూబ్ నగర్ జిల్ల, దివిటిసిమిలోని అటవిప్రాంతం సమీపంలోకి వచ్చాక రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. సిగ్నలింగ్ వ్యవస్థను కట్ చేసి దోపిడికి పాల్పడినట్లు సమాచారం.
నిద్రపోతున్న ప్రయాణికుల వద్ద నుంచి 24 తులాల బంగారంతో పాటు, 4 సెల్‌ఫోన్లను దొంగతనం చేశారు. రైలు కాచిగూడ చేరుకున్న తర్వాత ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. రైల్వే ఎస్పీని అడిగి ఘటన వివరాలను తెలుసుకున్నారు. రైల్వే పోలీస్ అధికారులు స్పందిస్తూ త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.