
ముగ్గురు పిల్లలతో బాలరాజు దంపతులు (ఫైల్), భారతమ్మ(ఫైల్) బాలనర్సయ్య(ఫైల్)
సాక్షి, యాదాద్రి/జగదేవ్‌పూర్: విషం కలుపుకుని తిన్నారా? పురుగుల మందు తాగారా? ఫుడ్ పాయిజన్ అయిందా? లేదా కోళ్ల కోసం ఉంచిన కెమికల్ బియ్యమే ప్రాణాలు తీసిందా? అసలు వారివి ఆత్మహత్యలా? హత్యలా? కారణాలేవైతేనేం.. తెల్లారేసరికి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి నిండు జీవితాలు తెల్లారిపోయాయి! రాత్రి భోజనం చేసి పడుకున్న వారంతా తెల్లారేసరికల్లా విగతజీవులుగా కనిపించారు. చనిపోయినవారిలో భార్యాభర్త, వారి ముగ్గురు పిల్లలు, అత్తామామ ఉన్నారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు(44), నిర్మల(40) దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె శ్రావణి(14), చింటు(12), బన్ని(8). బాలరాజు అత్తమామ జనగామ జిల్లా చిలుపూరు మండలం లింగంపల్లికి చెందిన బచ్చలి బాల నర్సయ్య(68), బచ్చలి భారతమ్మ(60). రాజాపేటకు చెందిన బెజగం నాగభూషణం కోళ్ల ఫారంలో నెల కిందట బాలరాజు, నిర్మల పనిలో చేరారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున వేతనం మాట్లాడుకున్నారు. యజమాని వారికి కోళ్లఫారం సమీపంలోనే వసతి కల్పించారు. బాలరాజు మామ బాల నర్సయ్య సమీపంలోని పాముకుంట శివారులో సతీశ్‌కు చెందిన దాబా హోటల్‌లో పనిచేస్తూ రాత్రి సమయంలో ఇక్కడికే వచ్చి పడుకుంటాడు. కొంతకాలంగా బాలరాజు, నిర్మల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతోపాటు బాలరాజు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు పెరిగినట్లు తెలుస్తోంది. గొడవల నేపథ్యంలోనే నిర్మల తల్లిదండ్రులైన భారతమ్మ, బాలనర్సయ్య ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.
గురువారం బాలరాజు, నిర్మల, బాలనర్సయ్య రాజాపేటకు వెళ్లి అక్కడ కల్లు డిపోలో కల్లు సేవించారు. ఇంటికి వస్తూ మధ్యలో చికెన్ తీసుకున్నారు. రాత్రి చికెన్ వండుకొని తిని అందరూ నిద్రపోయారు. కోళ్లఫారం యజమాని నాగభూషణం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చి వీరిని లేపే ప్రయత్నం చేశారు. ఎంతకీ లేవకపోవడంతో వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మళ్లీ వచ్చి లేపే యత్నం చేశాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో వీరిని పనిలో పెట్టించిన దాబా హోటల్ యజమాని సతీశ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తర్వాత వారిద్దరు వచ్చి చూశారు. తట్టి లేపే ప్రయత్నం చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులకు మిస్టరీగా కేసు
ఏడుగురు మృతి పోలీసులకు మిస్టరీగా మారింది. పురుగుల మందు తాగారా లేక తినే భోజనంలో కలుపుకుని తిన్నారా లేదా ఫుడ్ పాయిజన్ అయిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని రాచకొండ జాయింట్ సీపీ తరుణ్ జోషి, భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తోపాటు పోస్టుమార్టం నివేదిక తర్వాత కారణమేమిటన్న విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు భువనగిరిలో పోస్టుమార్టం నిర్వహించి.. శుక్రవారం రాత్రి మునిగడపలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఒకే గదిలో నిర్జీవంగా పడివున్న బాలరాజు కుటుంబ సభ్యులు
కెమికల్ కలిపిన బియ్యం తిన్నారా?
ఫారాల్లో కోళ్ల దాణాగా బియ్యం, నూకలు నిల్వ చేస్తారు. అవి ముక్కిపోకుండా, చోరీకి గురికాకుండా ఉండడానికి ఒక రకమైన కెమికల్ కలిపి నిల్వ చేస్తారు. ఫారంలోనే పనిచేస్తున్న బాలరాజు.. అవి కెమికల్ కలిపిన బియ్యం అని తెలియకుండా వాటిని తెచ్చి వండుకుని తినడంతో ఘోరం జరిగి ఉండవచ్చని కూడా పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
కారణం ఏమై ఉంటుంది?
ఒకే కుటుంబానికి చెందిన ఈ ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారా, తినే ఆహారంలో ఏవైనా విష పదార్థాలు కలిశాయా, లేదా వీరే క్రిమిసంహారక మందులు కలుపుకున్నారా, ఎవరైనా హత్య చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలరాజు అనారోగ్యానికి గురి కావడంతో భార్యాభర్త మధ్య గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ పోషణ కోసం వీరు పలుచోట్లకు మారారు. భార్య నిర్మల ప్రవర్తనపై అనుమానం పెంచుకొని బాలరాజే చికెన్‌లో విషం కలిపి అందరినీ హతమార్చి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. వీరు స్థానికంగా కల్లు తాగడంతోపాటు కొంత ఇంటికి కూడా తెచ్చుకున్నారు. మృతదేహాల మధ్య ఓ మద్యం బాటిల్‌తోపాటు మూడు క్రిమిసంహారక మందు డబ్బాలు కూడా పడి ఉన్నాయి. దీంతో వారి మరణానికి పురుగుల మందే కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.