కనగానపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్
కొందరు పోలీసు అధికారులవ్యవహారశైలి ఆ శాఖకే మచ్చ తెచ్చిపెడుతోంది. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి రాగానే విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగువేస్తున్నారు. ఇందుకు కనగానపల్లిఎస్‌ఐ శ్రీనివాసులు వ్యవహారమేనిదర్శనం.
అనంతపురం , కనగానపల్లి: కనగానపల్లి మండలంలో భానుకోట ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం. ఎస్‌ఐ శ్రీనివాస్ తరచూ తనిఖీల పేరుతో గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో సోదాల కోసం వెళ్లినపుడు తన పట్ల ఎస్‌ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడని వివాహిత ఆరోపించింది. అనంతరం కుటుంబ సభ్యులతో ఎస్పీని కలిసి ఎస్‌ఐ అసభ్యప్రవర్తనపై ఫిర్యాదు చేసింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్‌కుమార్ హామీ ఇచ్చారు. 15 రోజులైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తూతూ మంత్రంగా విచారణ
ఎస్పీ ఆదేశాల మేరకు ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ వివాహిత ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. అయితే డీఎస్పీ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టకుండా బాధితురాలితో పాటు వారి కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు తీసుకుని పంపించేశారు.
ఎస్‌ఐ తీరుపై ఆదినుంచీ విమర్శలే..
వీఆర్‌లో ఉన్న శ్రీనివాస్‌ను ఏడాది కిందట కనగానపల్లి ఎస్‌ఐగా నియమించారు. ఇక్కడ విధుల్లోకి చేరినప్పటి నుంచి అవినీతి ఆరోపణలతో పాటు ప్రవర్తన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీస్ సోదాలు, విచారణల పేరుతో గ్రామాలకు వెళ్లినపుడు ఇద్దరు, ముగ్గురు యువతులను ఎస్‌ఐ ట్రాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా చిరుద్యోగిని కూడా లొంగిదీసుకొని వారి సంసారంలోనూ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ వ్యవహారశైలిపై కొందరు పోలీస్ సిబ్బంది సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మహిళా ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో ఆగిన చర్యలు
ఎస్‌ఐ శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకునే సమయంలో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతిని«ధి జోక్యం చేసుకున్నారు. ఆమె ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేసినట్లు తెలిసింది. తనను వచ్చే ఎన్నికల సమయం వరకు ఇక్కడే ఉంచితే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్యమైన నాయకులపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు నమోదు చేస్తానని అధికార పార్టీ నాయకులకు ఎస్‌ఐ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మహిళా ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఎస్‌ఐపై చర్యలకు బ్రేక్ పడినట్లు తెలిసింది. తోటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసును మహిళా ప్రజాప్రతినిధి వెనకేసుకురావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment