‘చావు’ తెలివితేటలు | Six held for cheating banks in Hyderabad | Sakshi
Sakshi News home page

‘చావు’ తెలివితేటలు

Published Sun, Feb 9 2020 8:45 AM | Last Updated on Sun, Feb 9 2020 9:03 AM

Six held for cheating banks in Hyderabad - Sakshi

పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు.. ఇన్‌సెట్‌లో వివరాలు వెల్లడిస్తున్న సీపీ సజ్జనార్‌

సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదవశాతు మృతిచెందిన ఐటీ ఉద్యోగుల సెల్‌ఫోన్‌ నంబర్‌ ఇంటర్నెట్‌లో.. లేదంటే వారి కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటారు. నకిలీ ఐడీలతో డూప్లికేట్‌ సిమ్‌కార్డు పొందుతారు. రూ.లక్షల్లో ప్రీ అప్రూవ్‌డ్‌ లోన్‌ (ముందస్తు ఆమోదిత రుణాలు) తీసుకుంటున్న ఆరుగురు సైబర్‌ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.53,95,043 కొల్లగొట్టిన ఈ నయా తరహా చీటింగ్‌కు ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన పాలపర్తి రఘురాం పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాలు వినియోగించి రూ.2,76,000 రుణం పొందిన విషయం.. ఆ తర్వాత రికవరీకి వెళితే అతడు చనిపోయాడన్న విషయం తెలిసిందని ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఈ నెల 2న కేసు నమోదుచేశారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్‌ డీసీపీ కవిత, ఏసీపీ శ్రీనివాస్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.
  
నేరచరిత ఇదీ.. 
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు వాసి, ప్రధాన నిందితుడు నిమ్మగడ్డ ఫణి చౌదరి ఇంటర్మీడియట్‌ వరకు చదివి ఒంగోలులోని ఆర్‌టీఏ కార్యాలయంలో డాటా ఎంట్రీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే డ్రైవింగ్‌ లైసెన్స్, ఇతర సర్టిఫికెట్ల కోసం నకిలీ ఓటర్‌ ఐడీలు, పాన్‌కార్డులు గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో  2011లో నకిలీ వాహన నమోదు పత్రాలు సృష్టించిన కేసులో మాదనన్నపేట పోలీసులు, 2012లో సీసీఎస్‌ పోలీసులు, 2019 జూన్‌లో అక్రమ కాల్‌ రూటింగ్‌ మోసంలో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ, చైతన్యపురిలోనూ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులు ఉపయోగించి రూ.91 లక్షలు డ్రా చేసిన కేసులు అతడిపై ఉన్నాయి. నిమ్మగడ్డ ఫణి చౌదరి బంధువు గుంటూరు వాసులు వేణుగోపాల్, క్లాస్‌మేట్‌ అయిన పెడవల్లి శ్రీనివాసరావు, స్వరూప్‌నాథ్‌ చౌదరిలపై కేసులు ఉన్నాయి. స్వరూప్‌నాథ్‌ చౌదరి స్నేహితుడు కండ్రూ హరీశ్, వీర శంకర్‌రావులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరగాళ్లతో కలిసి ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా నయా మోసాలకు తెరలేపారు. ఈ ముఠాలోని నలుగురు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్‌ తెలిపారు.  

నయా మోసమిలా... 
ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగుల వివరాలు ఇంటర్నెట్‌ ఉపయోగించి (మొబైల్‌ నంబర్, కార్యాలయ స్థలం వంటివి) గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా నిమ్మగడ్డ ఫణి చౌదరి, మండవ స్వరూప్‌నాథ్‌ చౌదరిలు సులభంగా తెలుసుకునేవారు. ఈ సెల్‌ఫోన్‌ నంబర్‌ను సేకరించాక హరీశ్, వేణు గోపాల్‌ ఫొటోలను ఉపయోగించి శ్రీనివాసరావు నకిలీ ఐడీలు సృష్టించి సెల్‌ఫోన్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రాల్లో సమర్పించి అదే డూప్లికేట్‌ సిమ్‌కార్డును పొందేవారు. అలా వారి వద్ద రెండు రోజులు సిమ్‌కార్డు పనిచేస్తున్న సమయంలోనే మృతుడు కస్టమర్‌గా ఉన్న బ్యాంక్‌ల నుంచి సంక్షిప్త సమాచారాలు సెల్‌ఫోన్‌ నంబర్‌కు వచ్చేవి. ఆ విధంగా బ్యాంక్‌ ఖాతాలను గుర్తించేవారు. ఆ తర్వాత స్వరూప్‌నాథ్‌ చౌదరి, హరీశ్‌లు ఆయా బ్యాంక్‌లకు వెళ్లి ఏదో ఒక కారణాన్ని సిబ్బందికి చెప్పి మొబైల్‌తో అనుసంధానంగా ఉన్న ఖాతాలను గుర్తిస్తారు. కస్టమర్‌ ఐడీ, బ్యాంక్‌ ఖాతాలను సేకరించాక  నెట్‌ బ్యాంకింగ్‌లోకి లాగిన్‌ అయి ‘పాస్‌వర్డ్‌ మర్చిపోయారా’ అంటూ ఎంపికపై క్లిక్‌ చేసి జీమెయిల్, ఫోన్‌ నంబర్‌ సహాయంతో పాస్‌వర్డ్‌ను మారుస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మృతుడి ఐటీ ఉద్యోగుల జీమెయిల్స్, ఈమెయిల్స్‌ ఇంటర్నెట్‌లో దొరికితే సరి. లేదంటే మొబైల్‌ స్టోర్, కొన్నిసార్లు బ్యాంక్‌ల్లో ఫోన్‌ నంబర్‌ ఇచ్చి తెలుసుకుంటున్నారు.

ఇలా వారికి ఈమెయిల్‌ ఐడీ తెలియగానే పాస్‌వర్డ్‌ను బ్రేక్‌ చేసి ఆ మెయిల్‌కు గతలలో వచ్చిన రుణాలు, బ్యాంక్‌ ఖాతాలు, క్రెడిట్‌ కార్డు వివరాలు తెలుసుకుంటారు. ఇలా వీరు ఈమెయిల్‌కు మార్చిన పాస్‌వర్డ్‌ ద్వారా నెట్‌ బ్యాంకింగ్‌కు లాగిన్‌ అవుతారు. ఆ వెంటనే ప్రీ అప్రూవ్‌డ్‌ లోన్స్, క్రెడిట్‌ కార్డుల కోసం అభ్యర్థనలు పంపిస్తున్నారు. అలా ఆయా బ్యాంక్‌ల నుంచి రుణాలు మంజూరు కాగానే ఆ ఖాతా నుంచి వేణుగోపాల్, వీర శంకర్‌రావుల పేరుమీద తెరిచిన నకిలీ బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసేవారు. ఆ తర్వాత బ్యాంక్‌లు, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేవారు. అలాగే తమ క్రెడిట్‌ కార్డుల నుంచి క్యాష్‌ పాయింట్స్‌లోని వివిధ అకౌంట్‌లకు బదిలీ చేసుకొని మూడు శాతం కమిషన్‌ ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. మరికొన్ని సందర్భాల్లో మృతుల జీమెయిల్‌ ఐడీ వివరాలు తెలియకపోతే తాము పొందిన డూప్లికేట్‌ సిమ్‌ ద్వారా తమ రిజిస్టర్డ్‌ మెయిల్‌ ఐడీ మార్చాలని అభ్యర్థనలు పెట్టి మారాకా నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ అయిన ప్రీ అప్రూవ్‌డ్‌ రుణాలు పొందేవారు.  డెబిట్‌ కార్డులు కూడా అభ్యర్థన పెట్టి కొరియర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌కాల్‌ రాగానే అక్కడికెళ్లి హరీశ్, వేణుగోపాల్‌లు నకిలీ గుర్తింపు కార్డులు సమర్పించి తీసుకునేవారు. భవిష్యత్‌లో ఈ మోసాలను నివారించేందుకు రుణాలు మంజూరు చేసే సమయంలో ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేయాలని ఆర్‌బీఐకు లేఖ రాస్తాం. అలాగే సిమ్‌కార్డుల జారీలోనూ సరైన వెరిఫికేషన్‌ ఉండే విధంగా చూడాలని టెలికామ్‌ సర్వీసెస్‌కు సూచిస్తామ’ని సీపీ సజ్జనార్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement