
సన్ని బాబు (ఫైల్)
గచ్చిబౌలి: జీవితాన్ని ముగిస్తున్నా.. అందరికీ సారీ.. అంటూ మెయిల్ పెట్టి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఆర్.శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీఎన్‌వీఎస్ సన్ని బాబు (33) ఐదేళ్లుగా గచ్చిబౌలిలో జెన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కొండాపూర్‌లోని సుదర్శన్‌నగర్‌లోని 8బీ లేన్‌లో పెంట్‌హౌస్‌లో ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కుటుంబ సభ్యులకు సారీ చెబుతూ.. జీవితం ముగిస్తున్నానని బీసీసీలో మెయిల్ పెట్టాడు. అతడి బావ సంపత్ కుమార్ మధ్మాహ్నం 2 గంటలకు మెయిల్ చూసి హుటాహుటిన ఈసీఐఎల్ నాగారం నుంచి బయలుదేరి వచ్చారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో పొరుగు వారి సహాయంతో డోర్ పగులగొట్టి చూడగా సన్నిబాబు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఒంటరితనం కారణంగా మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment