సాక్షి, హైదరాబాద్: ప్రదీప్ కుమార్ ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. నెలకు రూ.70 వేల జీతం.. హస్తినాపురం సంతోషిమాత కాల నీలో జీప్లస్ వన్ ఇల్లు.. నెలకు అద్దె రూపే ణా రూ.20 వేల ఆదాయం.. సొంత ఊళ్లో పదెకరాల భూమి.. భార్య, ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగుతున్న ప్రయాణం.. ఉద్యోగమే కాదు సొంత కాళ్లపై నిలబడాలన్న తాపత్రయం.. భవిష్యత్ లో పిల్లల జీవితం బాగుండాలనే ఉద్దేశంతో వ్యాపారాల్లో పెట్టుబడులు.. వరుస నష్టాలతో మిగిలిన రూ.22 లక్షల అప్పు..దీంతో జీవితంలో ఒక్కసారిగా కుదుపు.. నిజానికి తనకున్న ఆస్తులు, భూములు, ఉద్యోగం ముందు ఈ అప్పు దిగదుడుపే. కానీ తన కలలన్నీ కల్లలై కలతే చెందాడో.. ఎవరికీ చెప్పుకోలేని బాధతో మనస్తాపానికే గురయ్యాడో.. భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు కలిపిన రాగి జావ ఇచ్చాడు. వారు ప్రాణాలు విడిచాక తానూ తనువు చాలిం చాడు. అంతకుముందు తండ్రిని ఉద్దే శించి లేఖ రాశాడు. ఎల్‌బీ నగర్‌లోని హస్తినాపురం సంతోషిమాత కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక వెలుగులోకి వచ్చిన ఓ కుటుంబం విషాదాంతమిది. (‘స్వాతికి ఇవేవీ తెలియదు నాన్నా..’)
రాగిజావలో పురుగుల మందు కలిపి..
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన కొట్రా ప్రదీప్‌కుమార్ (36)కు నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన శంకర్, పుష్పలతల కుమార్తె స్వాతి (28)తో 2012లో వివాహమైంది. ప్రదీప్‌కుమార్ కొంతకాలం బెంగళూరు టీసీఎస్ కంపెనీలో పనిచేశాడు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి గచ్చిబౌలిలోని ఐబీఎం సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. ప్రదీప్ పెద్ద కుమారుడు కల్యాణ్‌కృష్ణ (06) నాగార్జున పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు జయకృష్ణ ఏడాదిన్నర చిన్నారి. ప్రదీప్‌కుమార్ నాలుగేళ్ల క్రితం హస్తినాపురంలోని సంతోషిమాత కాలనీలో జీప్లస్ వన్ ఇంటిని నిర్మించాడు. ఇందుకోసం బ్యాంకు రుణం తీసుకున్నాడు. తరువాత మళ్లీ ఎల్‌ఐసీ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్‌తో పాటు వివిధ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాడు. వ్యాపారం చేయడం ద్వారా తాను నిలదొక్కుకోవడంతో పాటు తన పిల్లల్ని ఉన్నత స్థాయికి చేర్చాలని భావించాడు. కానీ వ్యాపారాల్లో నష్టం రావడంతో రూ.22 లక్షల అప్పులు మిగిలాయి. ఇది ఎవరికీ చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి గురైన ప్రదీప్ కొంతకాలంగా అసౌకర్యంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రదీప్.. పాఠశాలకు వెళ్లిన పెద్ద కుమారుడుని శనివారం మధ్యాహ్నమే ఇంటికి తీసుకొచ్చాడు. ముందుగానే పురుగుల మందు రాగిజావలో కలిపి భార్య, పిల్లలకు ఇచ్చాడు. వారు విగతజీవులుగా పడిపోయాక తానూ అదే తాగి తల్లి ఫొటో ముందు ప్రాణాలు విడిచాడు.
విషాదం వెలుగుచూసిందిలా..
శనివారం సాయంత్రం స్వాతి, ప్రదీప్‌కుమార్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్ అయ్యారు. వారి సెల్‌ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. దీంతో నగరంలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్వాతి అన్న గుగ్గిల్ల సతీష్‌కుమార్‌కు అనుమానం వచ్చింది. ఫోన్ చేయగా.. కలవలేదు. వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఫోన్‌లోనే వాకబు చేశాడు. అయినా సమాచారం తెలియలేదు. అప్పటికే టూర్‌లో ఉన్న సతీష్‌కుమార్.. వెంటనే తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి నగరానికి వచ్చాడు. ప్రదీప్ ఇంటికి వెళ్లగా ఇంటి డోర్ సెంట్రల్ లాక్ సిస్టం కావడంతో ఏమీ కనిపించలేదు. దీంతో అదే రాత్రి మూడు గంటలకు ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ అశోక్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి కిటికీ అద్దాలు పగులగొట్టారు. ప్రదీప్‌కుమార్ ఇంటి హాలులో తల్లి ఫొటో ఎదుట.. రక్తం కారుతూ పడి ఉన్న స్థితిలో కనిపించాడు. వెంటనే ఇంటి తలుపు పగులగొట్టి లోపలికెళ్లారు.
హాల్‌లో ప్రదీప్‌కుమార్, బెడ్‌రూమ్‌లో స్వాతి, చిన్నకుమారుడు జయకృష్ణ, పక్కనే పరుపుపై కల్యాణ్‌కృష్ణ విగతజీవులుగా పడి ఉన్నారు. అప్పటికే మృతదేహాలు డీకంపోజ్ అయిన స్థితికి చేరాయి. కల్యాణ్‌కృష్ణ స్కూలు డ్రెస్‌లోనే ఉండటాన్ని బట్టి శనివారమే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అంటున్నారు. పురుగుల మందు డబ్బాను, ప్రదీప్ తన డైరీలో తండ్రికి రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో గ్యాస్ స్టవ్‌పై రాగిజావ, ఆలుగడ్డ ఫ్రై ఉన్నాయి. వాటిలో పురుగుల మందును కలిపి ఈ దారుణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. ప్రదీప్‌కు, అతని కుటుంబానికి చెందిన లాప్‌టాప్, ఫోన్లలో లభించే సమాచారాన్ని బట్టి మరిన్ని కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నలుగురి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఎందుకిలా చేశారో..?!
స్వాతి, ప్రదీప్‌కుమార్‌ల కుటుంబసభ్యులు సోమవారం ఘటన స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించారు. దంపతులు అన్యోన్యంగా ఉండేవారని స్వాతి తండ్రి శంకర్ చెప్పారు. సూసైడ్ నోట్‌లో రూ.22 లక్షల అప్పు ఉన్నట్టు ఉందంటున్నారని, అయితే అల్లుడికి మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, దాని పక్కనే 200 గజాల స్థలం, ఊళ్లో పదెకరాల భూమి ఉందని, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో తెలియట్లేదని ఆయన విలపించారు. వారం క్రితం వీడియోకాల్ చేసి మనవడితో మాట్లాడానని, స్వాతి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్ అని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ‘శుక్రవారం ప్రదీప్‌తో మాట్లాడితే కరీంనగర్ వెళ్తానన్నాడు. రూ.22 లక్షల అప్పుకు భయపడి ఇలా చేస్తాడని అనుకోలేదు’ అని తండ్రి యాదయ్య కంటతడి పెట్టారు. కాగా, ప్రదీప్‌కుమార్.. తల్లి కళమ్మను చిన్నతనంలోనే కోల్పోయాడు.
నాన్నా.. ఇదే చివరి సందేశం..
‘నాన్నా మీకు రాసే చివరి సందేశం ఇదే అనుకుంటా. మీకు ఏదేదో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నా.. నాకింతకంటే మార్గం కనిపించలేదు. లైఫ్‌లో ఏదో చేయాలని, జాబ్‌పై ఆధారపడొద్దని, నాకంటూ సొంత కంపెనీ ఉండాలని, అందుకు డబ్బు సంపాదించాలని, ఇంటి రుణం త్వరగా తీర్చాలని తొందరపాటు నిర్ణయం తీసుకున్నా. రూ.22 లక్షల ఎల్‌ఐసీ లోన్ తీసుకున్నా. చాలా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నాను. తిరిగి చూస్తే అప్పులు తప్ప ఏమీ కనిపించలేదు. అమ్మ జ్ఞాపకార్థం ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్నాను. అప్పుల విషయం స్వాతికి తెలియదు. ఎవరికి చెప్పాలో తెలియదు. దారి దొరకడంలేదు. ఈ వయసులో నిన్ను ఇబ్బంది పెట్టకూడదని, నా పిల్లలు మీకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నాం. నన్ను క్షమించండి నాన్నా’.
- తండ్రికి రాసిన సూసైడ్ నోట్‌లో ప్రదీప్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment