
సాక్షి, నూజెండ్ల: మాతృదినోత్సవం నాడే కన్న తల్లిపై కొడుకు, కోడలు దాడి చేసి గాయపర్చిన ఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో ఆదివారం జరిగింది. బాధితురాలు, ఐనవోలు పోలీసుల కథనం మేరకు.. నూజెండ్ల మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన యెండ్లూరి ఆదెమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త మృతి చెందిన తర్వాత ఆదెమ్మ తమ ఆస్తిని పెద్ద కుమారుడు వెంకట్రావు, చిన్న కుమారుడు శ్రీనివాసరావుకు సమానంగా పంచింది.
కుమారులు తనను సరిగా చూడకపోవడంతో గ్రామంలోనే ఒక పూరిపాక కొనుగోలు చేసి అందులో నివాసం ఉంటోంది. కుమార్తె గంగినేని రవణమ్మ సూచన మేరకు పూరిపాక స్థానంలో నూతన గృహం నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇది తెలుసుకున్న పెద్ద కుమారుడు వెంకట్రావు, కోడలు అరుణ, మనవడు చెన్నయ్య శనివారం రాత్రి వృద్ధురాలైన ఆదెమ్మను దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ దాడిలో ఆదెమ్మ నుదురుపై తీవ్ర గాయమైంది. దీనిపై బాధితురాలు ఆదెమ్మ ఐనవోలు పోలీసులను ఆదివారం ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment