పోలీస్‌ దొంగయ్యాడు  | SPF Constable Convicted Of Theft | Sakshi
Sakshi News home page

పోలీస్‌ దొంగయ్యాడు 

Published Mon, Jul 29 2019 9:24 AM | Last Updated on Mon, Jul 29 2019 9:24 AM

SPF Constable Convicted Of Theft - Sakshi

చోరీ సొమ్మును చూపుతున్న డీఎస్పీ వెంకట్రావ్‌

సాక్షి, ఆత్మకూరు రూరల్‌: ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వాడు దొంగగా మారాడు..చోరీలను అరికట్టాల్సిన ఉండగా తానే దొంగతనాలు చేశాడు. పలు దొంగతనాల్లో నేరుగా పాల్గొని చివరకు ఆత్మకూరు పోలీసుల చేత చిక్కి ఊసలు లెక్కిస్తున్నాడో పోలీసు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు విలేకరుల సమావేశంలో ఆదివారం తెలిపిన మేరకు  వివరాలిలా.. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన షేక్‌ మస్తాన్‌ వలి శ్రీశైలం ప్రాజెక్ట్‌ సంరక్షణ విధుల్లో ఉండే స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆత్మకూరు పట్టణంలోని కేజీ రోడ్డు లో చక్రం హోటల్‌ సమీపంలోనున్న ఆమరాన్‌ బ్యాటరీ విక్రయ కేంద్రంలో చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.1,20,000 విలువైన బ్యాటరీలు చోరికి గురయ్యాయి. ఆత్మకూరు సీఐ శివనారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌  తదితరులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు సీసీ కెమెరాల్లోని ఫుటేజీ పరిశీలించి చోరీ జరిగిన రోజు ఆత్మకూరు పట్టణంలో వెనుక అద్దంపై ఇంగ్లీషు అక్షరం ‘ఎస్‌’ చిత్రించిన స్కార్పియో అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఈ ఆధారంతో పరిశోధన ప్రారంభించగా, ఆ వాహనం దోర్నాల పట్టణానికి చెందినదిగా ధ్రువీకరించారు. స్కార్పియో యజమాని షేక్‌ మస్తాన్‌ వలి బ్యాటరీలను దొంగిలించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితుడు మస్తాన్‌ వలితో పాటు ఆరోజు స్కార్పియో డ్రైవర్‌ షేక్‌ మహమ్మద్‌ హుసేన్‌లను శనివారం సాయంత్రం భానుముక్కల మలుపు వద్ద  చోరీలకు ఉపయోగించిన ఏపీ 27 బీఈ 3399 స్కార్పియోతో సహా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు చోరీకి గురైన బ్యాటరీలు, గతంలో దొంగిలించిన రెండు లారీ టైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులు గతంలో దోర్నాల పరిధిలో పలు ద్విచక్రవాహనాలను కూడా చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. నిందితుల అరెస్టులో కీలక పాత్ర పోషించిన హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు, హోంగార్డులు అమీర్‌ హంజ, కృష్ణా రెడ్డిలకు సీఐ శివనారాయణ స్వామి రివార్డ్‌ అందజేశారు. సీఐ శివనారాయణ, ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌లను డీఎస్పీ అభినందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement