అమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు నాగలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇదే ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని, అతడితో క్షమాపణ చెప్పించాలని ఆమె గురువారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆమెను కొంచెం మందలించారు. ఇప్పటికే తనను సూపరింటెండెంట్ వేధిస్తున్నారని ఆరోపిస్తున్న నాగలక్ష్మి ఈ సంఘటనతో అదే ఆరోపణలతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెతో ఫిర్యాదును ఉపసంహరింపజేసేందుకు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
చివరకు తనకు న్యాయం జరగలేదన్న మనస్తాపంతో శుక్రవారం సాయంత్రం అదే ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు నాగలక్ష్మి కాల్షియం, గ్యాస్‌కు సంబంధించిన మందు బిళ్లలను అధిక మోతాదులో మింగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. తక్షణమే ఆమెకు అదే ఆస్పత్రి వైద్యులు అత్యవరస వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సూపరింటెండెంట్ వేధిస్తున్నారంటూ స్టాప్ నర్సు నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై వి.శ్రీనివాసరావు, సీఐ జి.సురేష్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment