
హేమలత నుంచి వివరాలు సేకరిస్తున్న ఎల్విన్‌పేట ఏఎస్సై శంకరరావు
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ సంథిగూడ గ్రామానికి చెందిన బిడ్డిక హేమలత అనే విద్యార్థిని గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం.. హేమలత గుమ్మలక్ష్మీపురంలో ఉన్న సారథి ఓకేషనల్ జూనియర్ కళాశాలలో ఫస్ట్‌ఇయర్ చదువుతోంది. గుమ్మలక్ష్మీపురంలోనే నివాసముంటున్న అన్న,వదినల ఇంట్లో ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లివచ్చేది.
గత నెల 29న హేమలత ఇంట్లో చెప్పకుండా తన స్నేహితురాళ్లతో కలిసి ఊరుకు వెళ్లింది. గురువారం తిరిగి ఇంటికి రావడంతో చెప్పకుండా ఎందుకెళ్లావంటూ అన్నావదినలు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన హేమలత ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. కొంతసేపటి తర్వాత ఇంటికొచ్చిన కుటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న హేమలతను గమనించి వెంటనే భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా వైద్యాధికారి మహేశ్వరి వైద్యసేవలందించారు. విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు.