శిరోముండనం కేసులో ఎస్‌ఐ అరెస్టు | Sub Inspector Police Arrest in SC Man Head shaving Case East Godavari | Sakshi
Sakshi News home page

శిరోముండనం కేసులో ఎస్‌ఐ అరెస్టు

Published Wed, Jul 22 2020 9:46 AM | Last Updated on Wed, Jul 22 2020 1:45 PM

Sub Inspector Police Arrest in SC Man Head shaving Case East Godavari - Sakshi

మునికూడలిలో శిరోముండనం కేసుపై విచారణ చేస్తున్న డీఎస్పీ సత్యనారాయణరావు

తూర్పు గోదావరి, సీతానగరం (రాజానగరం): దళిత యువకుడిపై అమానుషంగా దాడి చేయడమే కాదు.. స్టేషన్‌లో శిరోముండనం చేసిన కేసులో ట్రైనీ ఎస్సై ఫిరోజ్‌షాను పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. అంతేకాదు అతడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై నా సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ కేసులో ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ఎస్సీ యువకుడు ఇండుగుబిల్లి ప్రసాద్‌కు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై ఫిరోజ్‌ సమక్షంలోనే తీవ్రంగా కొట్టి, ట్రిమ్మర్‌తో శిరోముండనం చేశారు.

వివరాల్లోకి వెళ్లితే.. ఈ నెల 18వ తేదీ రాత్రి 9.30 గంటలకు మునికూడలి వద్ద ఇసుక లారీ ముగ్గళ్లకు చెందిన బైక్‌ను ఢీకొట్టడంతో ఆ బైక్‌ నడుపుతున్న వ్యక్తి కాలు విరిగింది. దీంతో అక్కడే ఉన్న కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అదే సమయంలో కారుపై వచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్‌ భర్త కవల కృష్ణమూర్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, లారీని పంపేయాలనడంతో యువకులు తిరగబడ్డారు. కాలు విరిగి ఉంటే లారీని పంపమంటారేంటని తీవ్ర వాగ్వాదానికి దిగారు. (పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ యువకుడికి శిరోముండనం )

అంతే కాదు వారు కారు అద్దాలను పగలకొట్టారు. ఘర్షణ జరుగుతుందని తెలుసుకున్న అడపా పుష్కరం అక్కడికి చేరుకోగా అతడిని కూడా కొట్టారు. దీంతో పుష్కరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఐదుగురు యువకులు తనను కొట్టడంతో చేయి గూడె జారిపోయిందని, కారు అద్దాలు పగులకొట్టారని ఈనెల 19న ఫిర్యాదు చేశాడు. ఈనెల 20న ఇన్‌చార్జ్‌ ఎస్సై షేక్‌ ఫిరోజ్‌ షా ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి తన సిబ్బందితో కలిసి చేతులు, కాళ్లు, పిరుదులపై తీవ్రంగా కొట్టడమే కాకుండా, ట్రిమ్మర్‌ తెప్పించి, గెడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించించారు. బాధితుడు ప్రసాద్‌ తల్లి సత్యవతి స్టేషన్‌కు వచ్చి తన కుమారుడుని విడిచిపెట్టాలని ఎస్సైను కోరగా, ఆమెను కూడా దుర్భాషలాడినట్టు ఆరోపించింది.

అనంతరం రాత్రి సమయంలో విడిచిపెట్టడంతో మంగళవారం సమాచారం అందుకున్న దళిత సంఘాలు రంగంలోకి దిగి అర్బన్‌ ఎస్పీ శేముషీ బాజ్‌పేయ్, నార్త్‌జోన్‌ డీఎస్పీ సత్యనారాయణరావు, హుమన్‌రైట్స్‌ వారికి ఫోన్‌ల ద్వారా సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌ రెడ్డి, ఎస్సై యామన సుధాకర్‌ మునికూడలి వెళ్లి విచారణ చేపట్టారు. బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యసేవలు అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్‌చార్జ్‌ ఎస్సైను సస్పెండ్‌ చేశామని, ఎస్సై, కవల కృష్ణమూర్తితో పాటుగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు.

‘పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలి’
తాడితోట: దళిత యువకుడి  శిరోముండనం  కేసులో సీతానగరం పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. రోడ్డు ప్రమాదం జరగగా ఇండుగుమిల్లి ప్రసాద్‌ అనే యువకుడిని పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకువెళ్లి శిరోముండనం చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయడం కాకుండా ఉద్యోగం నుంచి తొలగించి వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి జీఓ నంబర్‌ 95 ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఆదుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అమానుష చర్య : జక్కంపూడి రాజా
ఇలాంటి సంఘటనలు జరగడం అమానుషమని, ఇది హేయమైన చర్యని, దీనికి కారణమైన వారిపై కఠినమైన  చర్యలు తీసుకుంటారని కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మునికూడలిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంఘటనతో పార్టీకి సంబంధం లేదని, దళితులకు ఎప్పుడూ పార్టీ పెద్దపీట వేసిందన్నారు. ఇప్పటికే ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారన్నారు.  బాధితుడ్ని బొల్లినేని హాస్పటల్‌లో ఆయన పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement