
హర్షవర్ధన్ (ఫైల్)
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్/తిరుపతి క్రైం: ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి అనంతరం వెస్ట్ రైల్వేస్టేషన్‌లో సమీపంలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్ ప్రదీప్‌కుమార్, పోలీసులు తెలిపిన వివరాలు..పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ చదువులో చురుగ్గా ఉండేవాడు. వ్యవసాయ కూలీ అయిన అతడి తండ్రి రెక్కల కష్టంతో అతడిని చదివిస్తున్నాడు.
ఇంటర్‌లో కూడా హర్షవర్ధన్ 90 శాతం పైగా మార్కులు సాధించాడు. ఇక్కడ బీటెక్ చేస్తున్న అతడు బుధవారం ఉదయం ప్రాక్టికల్ పరీక్షకు హాజరై బాగా రాశాడు. అయితే ఇదేరోజు రాత్రి నుంచి ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల అనుబంధ వసతి గృహంలో హర్షవర్ధన్ కనిపించకపోవడంతో విద్యార్థులు అతడి కోసం గాలించసాగారు. వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై బుధవారం అర్ధరాత్రి హర్షవర్ధన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇది తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపల్ రాత్రి ఒంటి గంట సమయంలో అక్కడికి చేరుకుని పోలీసులతో పాటు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి తరలించారు. గురువారం ఉదయం పోస్టుమార్టం అనంతరం హర్షవర్ధన్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. చదువులో చురుకైన ఈ విద్యార్థి బలవన్మరణం తనను కలచివేసిందని, ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటో తనకు తెలియదని ప్రిన్సిపల్ చెప్పారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.