మచిలీపట్నంలో మహిళా వలంటీర్‌పై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
సాక్షి, మచిలీపట్నం/కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వార్డు వలంటీర్లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తాను నాలుగు నెలల గర్భవతినని, తనను వదిలిపెట్టండని ప్రాధేయపడినా వదలకుండా విచక్షణారహితంగా దాడి చేసి మహిళా వలంటీర్‌ను గాయపర్చారు. అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను కూడా చితకబాదారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళా వలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు.
అసలేం జరిగింది?
మచిలీపట్నం తొమ్మిదో వార్డు సచివాలయ పరిధిలో వార్డు వలంటీర్లు మద్దెల భారతి, గుల్ల మౌనిక శనివారం కొత్త బియ్యం కార్డుల జాబితాను పరిశీలిస్తున్నారు. అయితే, తమ ఓట్లను తొలగించేందుకే వలంటీర్లు ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారన్న అనుమానంతో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వార్డు వలంటీర్లతో వాదనకు దిగారు. తాము బియ్యం కార్డుల జాబితాను పరిశీలిస్తున్నామని చెబుతున్నా వినకుండా దుర్భాషలాడుతూ దాడికి తెగపడ్డారు. తాను గర్భవతినని, తనను విడిచిపెట్టాలని మద్దెల భారతి వేడుకున్నా వారు పట్టించుకోలేదు.
ఆమెపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డారు. రమణారెడ్డి అనే వ్యక్తి వలింటీర్లకు రక్షణగా నిలిచి, టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆయనపైనా పిడిగుద్దులు గుద్దుతూ దాడికి తెగపడ్డారు. ఈ ఘటనలో రమణారెడ్డితో పాటు వలంటీర్లు మద్దెల భారతి, గుల్ల మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు అంతటితో ఆగకుండా వార్డు సచివాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని ధ్వంసం చేశారు. గాయపడిన మహిళా వలంటీర్లను స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తీవ్ర గాయాలపాలైన వలంటీర్ మద్దెల భారతి స్టేషన్‌లో స్పృహతప్పి పడిపోగా పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
టీడీపీ కార్యకర్తల హల్‌చల్
జరిగిన ఘటనపై వార్డు వలంటీర్లు భారతి, మౌనిక మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన అనుచరులకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌లో జరుగుతున్న తతంగాన్ని ఫొటోలు, వీడియో తీస్తున్న పాత్రికేయులను మీ అంతు చూస్తానంటూ బెదిరించారు.
Comments
Please login to add a commentAdd a comment