కృష్ణాజిల్లా,ఉయ్యూరు (పెనమలూరు) : మానవ మృగాలకు గండిగుంట అడ్డాగా మారింది. ఉయ్యూరు పట్టణాన్ని ఆనుకుని ఉండి.. టీడీపీ ఆధిపత్యంలో కొనసాగుతున్న గ్రామంలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ నేతల అండతో కొందరు యువత కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్ల జీవితాలను బుగ్గిపాలు చేసి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. అదిరింపులు.. బెదిరింపులు.. మాయమాటలతో అబలలను లోబర్చుకుని పచ్చని పల్లెలో విషసంస్కృతికి బీజం వేస్తున్నారు. ఈ నెలలో వరుసగా మైనర్లపై జరిగిన ఘటనలు వెలుగుచూడటమే ఇందుకు నిదర్శనం. ఈ దుర్మార్గాలకు పాల్పడిన వారి వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ యువనేత ఉండటమే ఇక్కడ కొసమెరుపు.
పేట్రేగుతున్న అసాంఘిక శక్తులు..
టీడీపీలో ఓ సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్న గండిగుంటలో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇటీవల కాలంలో కొందరు యువత బరితెగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అండదండలతో పట్టుసాధించేందుకు కొందరు నాయకులు యువతను చెడు మార్గాలవైపు ప్రోత్సహించడంతో గ్రామం పూర్తిగా కలుషితమైంది. మాయమాటలతో షో చేస్తూ మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వారం రోజుల క్రితం మైనర్లపై వెలుగు చూసిన ఘటనలతో సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఎదురైంది.
♦ తలారి శ్రీనివాసరావు అనే ముప్పై ఏళ్లు పైబడిన వ్యక్తి పన్నెండేళ్ల మైనర్‌పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
♦ అదే గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మాయమాటలతో ప్రేమంటూ నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఆరునెలల గర్భవతిని చేసి వదిలేశాడు. ఈ వ్యవహారంపైనా కేసు నమోదైంది. ఫోక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఆదివారం రెండు ఘటనల్లో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాలికలపై జరిగిన దాడులను కప్పిపుచ్చేందుకు ఓ యువనేత తన శక్తినంతా ప్రయోగించడమే అధికార పార్టీ అరాచకాలకు ఒక నిదర్శనం. గ్రామంలో వెలుగుచూడని అసాంఘిక ఘటనలు ఎన్నింటినో పెద్దలు గతంలో కప్పిపుచ్చినట్లు సమాచారం.
యువనేతకుపోలీసుల వార్నింగ్..
మైనర్ బాలికలపై జరిగిన ఘటనల విషయంలో మధ్యవర్తిత్వం వహించిన అదే గ్రామానికి చెందిన తెలుగు తమ్ముడికి పోలీస్ ఉన్నతాధికారులు ఎట్టకేలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కేసు నమోదు చేశాక అరెస్టు చేయకుండా ఆ యువనేత అడ్డుపడుతుండటంతో బాధితులు విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు గండిగుంటకు చెందిన ఆ యువనేతను అదుపులోకి తీసుకోవడంతో ఆ వెంటనే రెండు కేసుల్లో నిందితులు టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి అరెస్టు అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధులతో ఫొటోలతో ఫ్లెక్సీలు కడుతూ అసాంఘిక శక్తులను పెంచి పార్టీని అల్లరి చేస్తున్న ఆ యువనాయకుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీడీపీలోని కొందరు నాయకులు కోరుతున్నారు. ఇదే అంశంపై టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment