
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరిహరరావు
సోంపేట శ్రీకాకుళం : సామాన్యులపై టీడీపీ నాయకుల ఆగడాలు అధికమవుతున్నాయి. అధికారం అండతో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. నెల రోజుల క్రితం కాశీబుగ్గ మున్సిపాలిటీలో వ్యాపారి సమక్షంలో దుకాణంలో పనిచేస్తున్న బాలుడిపై దాడి చేసిన ఘటన మరువక ముందే సోంపేటలో వర్తకుడిపై టీడీపీ ఎంపీటీసీ గురువారం దాడి చేశారు. టీడీపీ నేతల ఆగడాలపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
సోంపేట పట్టణంలోని మధు ఎంటర్ ప్రైజెస్ యజమాని పైడి శెట్టి హరిహరరావు స్థానిక స్టేట్‌బ్యాంకు పక్కన ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం స్టేట్ బ్యాంకుకు వచ్చిన కొర్లాం గ్రామానికి చెందిన తంగుడువర ప్రసాదరావు, దాసరి దుర్యోధన.. హరిహరరావు దుకాణానికి ఎదురుగా ద్విచక్రవాహనాన్ని నిలిపివేశారు. దీంతో షాపునకు కొనుగోలుదారులు రావడానికి రహదారి లేదని, కొద్దిగా పక్కకు పెట్టాలని హరిహరరావు సూచించారు.
దీంతో వరప్రసాదరావు, దుర్యోధన తమ హెల్మెట్‌తో దాడి చేశారు. ఆ సమయంలో కొర్లాం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు ఎస్.వెంటకరమణ అక్కడే ఉన్నారు. ఆయన కూడా తనపై దాడి చేశారని హరిహరరావు తెలిపారు, గొడవను ఆపాల్సింది పోయి దాడి చేసినవారికి సాయం చేయడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈదాడిలో హరిహరరావు తలకు తీవ్రగాయమైంది. సోంపేట సామాజిక ఆస్పత్రిలో వైద్యుడు శివాజీ వైద్య చికిత్సలు నిర్వహించారు.
పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయడానికి వెళితే అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు స్టేషన్ వద్దకు చేరుకుని దాడి చేసిన వారికి మద్దతు తెలిపారని ఆయన వాపోతున్నారు. హరిహరరావు ఫిర్యాదు మేరకు తంగుడు వర ప్రసాద్, దాసరి దుర్యోధన, ఎస్.వెంటకరమణపై సోంపేట ఎస్‌ఐ సి.హెచ్ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.