
సాక్షి, వనపర్తి : తాను పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని మరిచిపోయాడు.. అక్రమ సం పాదన కోసం అడ్డదారి తొక్కాడు. పోలీసుల పేరు తో దారికాచి బెదిరిస్తూ దోపిడీ పాల్పడుతున్నా డు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి ఉల్లెంగొడ్ల సత్యనారాయణ కొల్లాపూర్ అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
వీపనగండ్ల మండలం సంగినేనిపల్లికి చెందిన మానపాడు నర్సింహ వనపర్తి మండలం నందిమళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరు మంచి మిత్రులు. వచ్చిన సంపాదన సరిపోదనుకున్నారేమో.. దారిదోపిడీ చేయాలని నిశ్చయించారు. ఇంకేముంది నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకున్నారు. వనపర్తి నుంచి పెబ్బేరు వెళ్లేదారిలో సీడ్ మిల్ నుంచి కిష్టగిరితండా అటవీప్రాంతంతో పా టు తిరుమలాయగుట్టకు దైవదర్శనానికి వచ్చివెళ్లేవారిని రాత్రివేళ టార్గెట్ చేశారు. పోలీసులు పేరు తో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టారు. సెల్‌ఫోన్లు, వారి వద్ద ఉన్న నగదును దోచుకెళ్లడం ప్రారంభించారు.
పోలీసులకు చిక్కింది ఇలా..
కొద్దికాలం సాఫీగానే సాగిన వీరి వ్యవహారం కొందరు బాధితులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. గతనెల 28న కిష్టగిరితండా వద్ద సత్యనారాయణ, నర్సింహ అక్కడే నిల్చుని ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసుల పేరుతో బెదిరించి వారినుంచి సెల్‌ఫోన్, రూ.400 లాక్కున్నారు. అంతకుముందు తిరుమలాయగుట్ట అటవీప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌తో పాటు రూ.3,200 నగదు కాజేశారు. బాధితులు వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కదలికలపై ఓ కన్నేశారు.
తిరుమలాయగుట్ట అటవీప్రాంతంలో మద్యం సేవిస్తున్న సత్యనారాయణ, నర్సింహను పోలీసులు అనుమానం వచ్చి ప్రశ్నించారు. ఇక్కడే పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ ఇద్దరు తామే అసలు పోలీసులమని, మీరెందుకు ఇక్కడికి వచ్చారని నిలదీశారు. దీంతో పోలీసులు వారి సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకుని బాధితులకు వాట్సప్ ద్వారా పంపించారు. వారు నిందితులను గుర్తుపట్టారు. సదరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రేమజంటలే టార్గెట్!
యువతీ, యువకులు, ప్రేమజంటలు, పర్యావరణ ప్రియులు పెబ్బేరు రోడ్డులోని తిరుమలాయగుట్ట అటవీప్రాంతానికి వెళ్తుంటారు. మద్యం సేవించేవారు.. దైవదర్శానికి వెళ్లేవారు ఇదే ప్రాంంతాన్ని కేంద్రంగా చేసుకుంటారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు దుండగులు ప్రేమజంటలు, యువతీయువకులను బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. విషయం ఇంట్లో తెలిస్తే ఇబ్బంది అవుతుందని ప్రేమజంటలు, యువతీ యువకులు మద్యం సేవిస్తున్నారని బయటపడితే సమాజంలో పరువు పోతుందని మద్యం ప్రియులు విషయాలను బయటకు పొక్కనివ్వడం లేదు. దీంతో దుండగులు ఆడిందే ఆట పాడిందే పాటగా వారి వ్యవహారం సాగుతోంది.
బాధితుల ఫిర్యాదుతో..
వనపర్తి నుంచి పెబ్బేరు వెళ్లేదారిలో దారిదొపిడీకి పాల్పడి, సెల్‌ఫోన్లు, నగదు లాక్కుంటున్నారని ఫిర్యాదు రావడంతో నిఘా పెంచాం. అటవీప్రాంతంలో మద్యం సేవిస్తూ అనుమానం వచ్చిన ఇద్దరి ఫొటోలను తీసి బాధితులకు పంపించడంతో గుర్తుపట్టారు. దీంతో అసలు నిందితుల బాగోతం బయటపడింది. కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపించాం. – మశ్చేందర్‌రెడ్డి, వనపర్తి రూరల్ ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment