
సాక్షి, నోయిడా : నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మంగళవారం ఉదయం వేకువ జామున ఈ సంఘటనను కుటుంబ సభ్యులు గుర్తించారు. చనిపోయిన అక్కాచెల్లెళ్లలో ఒకరికి 18 ఏళ్లు కాగా మరొకరికి 13 ఏళ్లు. అయితే, ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నోయిడాలోని సెక్టార్ 49లోగల బరోలా అనే గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. వారు మంగళవారం ఉదయం 4గంటల ప్రాంతంలో నిద్రలేచి చూసిన తల్లిదండ్రులకు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు.
అయితే, తమకు దూర బంధువు అయిన రవి అనే యువకుడు తమ కూతుర్లను హత్య చేసినట్లు ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. రవికి ఇది వరకే పెళ్లయిందని, అయినప్పటికీ తమ పెద్ద కూతురును ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని, తన తల్లిదండ్రులను తీసుకొచ్చి గొడవ కూడా చేశాడని చెప్పారు. అంతేకాకుండా తాను చెప్పింది వినకుంటే ఇద్దరి కూతుర్లకు డేంజర్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లినట్లు చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం ఇది హత్యా.. లేక ఆత్మహత్యా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం అన్నారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment