సాక్షి, ఒంగోలు: ప్రేమించిన యువతితో నిశ్చితార్థమైన తర్వాత కూడా ఆమె తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక గద్దలగుంటలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే బక్కా నాగేంద్ర (30) చెక్క పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను పుట్టిన కొద్ది నెలలకే తండ్రి ఎటో వెళ్లిపోయాడు. నాగేంద్రకు పది నెలల వయస్సుండగానే తల్లికి పెద్దలు రెండో వివాహం చేశారు. నాగేంద్ర చిన్న వయసులోనే తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. అమ్మమ్మ, తాతయ్యలే దిక్కుగా మారారు. ఆ వృద్ధుల ఆసరాతో ఎదుగుతున్న ఇతడు ఏడాది క్రితం సింగరాయకొండ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. చదవండి: ఒక టీచర్.. నాలుగు పెళ్లిళ్లు
చివరకు ఇరుకుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజుల తర్వాత యువతి తల్లిదండ్రులు వివాహానికి ససేమిరా అన్నారు. నాగేంద్ర ప్రవర్తన తమకు నచ్చలేదంటూ వెనక్కు తగ్గారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులకు దూరమై, మరో వైపు ఏడు పదుల వయస్సులో తనకు అండగా ఉంటున్న వృద్ధుల వెతలను చూడలేక అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మనుమడిని ఓదార్చేందుకు, అతడిలో ధైర్యం నింపేందుకు ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా కష్టపడ్డారు. ఆ మధ్య అన్నీ మరిచిపోయి నాగేంద్ర పనులకు కూడా వెళ్తుండటంతో తాత, అమమ్మలు సంతోష పడ్డారు.
ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 8 గంటలకు తాత మారెళ్ల సుబ్బారావు తాను పనిచేసే కాలేజీకి వెళ్లాడు. అమ్మమ్మ గుడికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే నాగేంద్ర నిర్జీవంగా దూలానికి వేలాడుతూ కనిపించాడు. ఆ వృద్ధ దంపతులు తమ మనుమడి మృతదేహాన్ని కిందకు దించి భోరుమన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడి తాత ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment