తమిళనాడులో పేలుళ్లకు కుట్ర? | Terrorist organization Find in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?

Published Mon, Jul 15 2019 7:14 AM | Last Updated on Mon, Jul 15 2019 9:47 AM

Terrorist organization Find in Tamil Nadu - Sakshi

అసన్‌ అలీని కోర్టుకు తీసుకెళుతున్న ఎన్‌ఐఏ అధికారులు

సాక్షి ప్రతినిధి, చెన్నై:  శ్రీలంకలో ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లకు పాల్ప డిన ముష్కరులు తమిళనాడులో సైతం విధ్వంసానికి కుట్రపన్నుతున్నట్లు తెలుస్తోంది. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎన్‌ఐఏ) అధికారుల బృందానికి రాష్ట్రంలో పట్టుబడిన తీవ్రవాదుల వల్ల ఈ విషయం బహిర్గతమైనట్లు సమాచారం. శ్రీలంక దుర్ఘటన తరువాత భారత్‌ అప్రమత్తమై తీవ్రవాదుల కోసం ముమ్మురంగా గాలింపు ప్రారంభించింది. ఇందులో భాగంగా తమిళనాడులో సైతం గత నాలుగునెలలుగా తీవ్రస్థాయిలోఎన్‌ఐఏ అధ్వర్యంలో తనిఖీలు సాగుతున్నాయి. చెన్నై పూందమల్లిలోని ఒక అపార్టుమెంటులో దాక్కుని ఉన్న శ్రీలంక యువకుడు కొన్నినెలల కిత్రం పట్టుబడ్డాడు. ఇతనికి శ్రీలంక పేలుళ్ల సూత్రధారితో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. ఇతనితోపాటూ పలువురు స్నేహితులు అదే అపార్టుమెంటులో ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే వారెవరో ఆచూకీ తేలలేదు. ఇదిలా ఉండగా, శనివారం నాడు చెన్నై, నాగపట్టణంలో తనిఖీలు చేపట్టారు. చెన్నై మన్నడి లింగుచెట్టి వీధిలో ‘వాగాద్‌–ఇ–ఇస్లామీ హింద్‌’ అనే కార్యాలయం పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ సంస్థ చెన్నై కేంద్రంగా చేసుకుని తీవ్రస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు శనివారం ఉదయం 6 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిపిన సోదాల్లో అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా తమిళనాడులో పేలుళ్లకు పాల్పడేందుకు ఇది కొత్తగా వెలసిన తీవ్రవాద సంస్థగా భావిస్తున్నారు.

ఈ సంస్థ అధినేత సయ్యద్‌ బుఖారీ చెన్నై వేప్పేరీ–పూందమల్లి రహదారిలోని ఒక అపార్టుమెంటులో నివసిస్తున్నట్లు కనుగొన్న అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. ఆ అపార్టుమెంటు నుంచి సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు మాత్రమే చిక్కాయి. అలాగే నాగపట్టణంలో కూడా మెరుపుదాడులు నిర్వహించి తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.చెన్నైలో ఉన్న సయ్యద్‌ బుహారీ, నాగపట్టణంలో తలదాచుకుని ఉన్న అసన్‌ అలి,  ఆరిష్‌ మహమ్మద్‌ అలి, తవ్‌హీద్‌ అహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  వీరి నుంచి 9 మొబైల్‌ఫోన్లు, 15 సిమ్‌కార్డులు, 7 మెమొరీకార్డులు, 3 లాబ్‌ట్యాబ్‌లు, ఐదు హార్డ్‌ డిస్క్‌లు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిలో అసన్‌ అలి, ఆరిష్‌ మహమ్మద్‌ అలి అనే ఇద్దరిని చెన్నై పూందమల్లిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. మిగిలిన ఇద్దరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తుండగా త్వరలో అరెస్ట్‌ చూపే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, తేనీలోని ఒక విద్యాసంస్థలో కూడా ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు చేశారు. కుంభకోణంలో ఇటీవల జరిగిన పీఎంకే నేత రామలింగం హత్యకేసుకు సంబంధించే ఈ తనిఖీలు సాగినట్లు సమాచారం. హత్య జరిగిన తరువాత 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినా, వీరికి తీవ్రవాద ముఠాతో సంబంధాలపై అనుమానం రావడంతో ఎన్‌ఐఏ అధికారులు రంగప్రవేశం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement