స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, నగదును ప్రదర్శిస్తున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్ రూరల్ : అంతర్ జిల్లా దొంగ రాపాక గిరిబాబు అలియాస్ గిరి ప్రసాద్ అలియాస్ యాదగిరిని సీసీఎస్, టౌన్, తొర్రూరు పోలీసులు అరెస్ట్ చేసి, దొంగిలించిన 30 తులాల బంగా రం, కేజీ 30 గ్రాముల వెండి ఆభరణాలు, ఆటో, రూ.80వేల నగదు (మొత్తం సొత్తు విలువ రూ. 10.50 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ వివరాలు వెల్లడించారు.
సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఎలా చేధించగలిగారో ప్రొజెక్టర్ ద్వారా చూపించి వివరించారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్‌లో పగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి పూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను సీసీ కెమెరాల్లో రికార్డయిన ఛాయా చిత్రాల ద్వారా గుర్తిం చామన్నారు. దీంతో మహబూబాబాద్ టౌన్ సీఐ షేక్ అబ్దుల్ జబ్బార్, సీసీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్ జిల్లా దొంగ అయిన రాపాక గిరిబాబును తొర్రూరు నుంచి మహబూబాబాద్‌కు వస్తుండగా మూడుకోట్ల సెంటర్ వద్ద పట్టుకున్నారని తెలిపారు.
మానుకోటలోని తొర్రూరు రోడ్‌లో గల వాటర్‌ట్యాంక్ వద్ద ఉంటూ పండ్ల వ్యాపారం చేసే రాపాక గిరిబాబును పోలీసులు విచారించగా మహబూబాబాద్, తొర్రూరు, ఖమ్మం, పాల్వంచ ప్రాం తాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడన్నా రు. చోరీ ద్వారా సంపాదించిన బంగారు వస్తువులను దాచిపెట్టి వాటిని మహబూబాబాద్ పట్టణంలో రహస్యంగా అమ్మాలని వచ్చినట్లు, తాను చేసి న నేరాలన్నింటినీ అంగీకరించాడని తెలిపారు.
చెడు అలవాట్లకు బానిసై..
రాపాక గిరిబాబు 5వ తరగతి వరకు చదువుకుని ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోక చెడు అలావాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్నాడు. మొదటగా నాలుగేళ్ల క్రితం ఖమ్మంలో ఆటో దొంగతనం కేసులో అరెస్టై జైలు జీవితం గడిపాడు.
ఆ తరువాత కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మళ్లీ కొద్దిరోజులకు రెండోసారి పాల్వంచలో ఆటో దొంగతనానికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. అనంతరం జైలు నుంచి విడుదలై మహబూబాబాద్ గిరిబాబు అత్తగారి ఊరు కావడంతో ఇక్కడే ఉంటూ మధ్యాహ్నం పళ్ల వ్యాపారం చేస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు.
మానుకోటలో 7,తొర్రూరులో 3 దొంగతనాలు..
సుమారు 6 నెలల క్రితం మహబూబాబాద్‌లోని వెంకటేశ్వర బజార్‌లో ఓ ఇంటి ముందు తాళం వేసి ఉన్న ఆటోను దొంగిలించాడు. తరువాత సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గిరిబాబు దొంగతనం చేయడానికి అనుకూలమైన పనిముట్లను జనగామ నుంచి తయారు చేయించుకున్నాడు. దీంతో మహబూబాబాద్‌లోని కృష్ణకాలనీ, సిద్ధార్థనగర్, వెంకటేశ్వరబజార్, కంకరబోడ్ ప్రాంతాల్లో మొత్తం 7 దొంగతనాలు చేశాడు.
అనంతరం తొర్రూరు పట్టణంలో మూడు దొంగతనాలు చేశాడు.అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందనలు..అంతర్ జిల్లా నేరస్తుడు రాపాక గిరిబాబును చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద నుంచి సొత్తు ను రికవరీ చేసిన మహబూబాబాద్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఎస్.ఏ జబ్బార్, తొర్రూరు సీఐ వి.చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, సీసీఎస్ ఏఎస్సై పి.వెంకటరమణ, పీసీ సీహెచ్ వేణుగోపాల్, అలాగే నేరస్తుడిని సీసీ కెమెరాల ద్వా రా గుర్తించిన ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, పీసీ లు నాగరాజు, సంతోష్‌కుమార్‌ను ఎస్పీ నంద్యా ల కోటిరెడ్డి అభినందించి రివార్డు అందజేశారు.
సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు నరేష్‌కుమార్, రాజారత్నం, సీఐలు జబ్బార్, చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, ఏఎస్సై పి.వెంకటరమణ, ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్, రమేష్‌బాబు, అశోక్, పీసీలు వేణుగోపా ల్, నాగరాజు, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment